కలకలం రేపిన మహిళ మృతదేహం

Mar 31,2024 20:42 #disturbance, #woman body

– కాలిన స్థితిలో లభ్యం
– హత్య చేసి నిప్పంటించినట్లు అనుమానం
ప్రజాశక్తి – తెనాలి (గుంటూరు జిల్లా) :గుంటూరు జిల్లా తెనాలి మండలం రూరల్‌ పరిధిలోని సంఘం జాగర్లమూడి గ్రామంలో ఆదివారం మహిళ మృతదేహం కలకలం రేపింది. పూర్తిగా కాలిన స్థితిలో ఉన్న మహిళ మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. డిఎస్‌పి ఎం రమేష్‌ బాబు, సిఐ టి.వెంకటేశ్వర్లు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. క్లూస్‌ టీమ్‌ను రప్పించి ఆధారాలు సేకరించారు. మహిళది హత్యా, ఆత్మహత్య అన్న కోణంలో స్థానికులను విచారిస్తున్నారు. చంపేసిన తరువాతే ఇక్కడికి తీసుకొచ్చి పెట్రోల్‌ పోసి తగలబెట్టారని అనుమానిస్తున్నారు. సిఐ టి.వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల ప్రకారం.. సుమారు 25 నుంచి 30 సంవత్సరాల వయసున్న మహిళ మఅతదేహం గ్రామంలోని శివాలయం సమీపంలో డంపింగ్‌ ప్రాంతంలో పూర్తిగా కాలిన స్థితిలో ఉందన్నారు. ఆమె కుడి చేతికి పది గాజులు, ఎడమ చేతికి పింక్‌ కలర్‌ వాచ్‌ ఉంది. ఆమె మెడలో ఉన్న తాడుకు ఆంజనేయస్వామి, వెంకటేశ్వర స్వామి బమ్మల లాకెట్లు ఉన్నాయి. ఆమె ఒంటిపై ఎరుపు రంగు పంజాబీ డ్రెస్‌ ఉందని, ఎత్తు 4.5 అడుగులు ఉండవచ్చని సిఐ చెప్పారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, ఆమె మృతిపై స్థానికులను విచారిస్తున్నామని చెప్పారు. ఆనవాళ్లు గుర్తించిన వారు 9440796219, 440796170 ఫోన్‌ నెంబర్లకు సమాచారం ఇవ్వాల్సిందిగా కోరారు.

➡️