- ఇంటర్ విద్యార్థినిపై పెట్రోల్ పోసి నిప్పంటించి హత్య
ప్రజాశక్తి- నందికొట్కూరు టౌన్ (నంద్యాల జిల్లా), అమరావతి బ్యూరో : నంద్యాల జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఉన్మాది ఘాతుకానికి ఇంటర్ విద్యార్థిని బలైంది. ఈ ఘటనపై రాష్ట్ర హోం శాఖ మంత్రి అనిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థిని బంధువులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం… నందికొట్కూరు పట్టణం బైరెడ్డి నగర్‌లోని ఓ ప్రయివేటు కళాశాలలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం లహరి (17) చదువుతోంది. ప్రేమ పేరుతో ఆమెను రాఘవేంద్ర అనే యువకుడు వేధిస్తుండేవాడు. ఆదివారం అర్ధరాత్రి ఆమె గదిలోకి ఆ యువకుడు ప్రవేశించాడు. నోట్లో గుడ్డలు కుక్కి ఒంటిపై పెట్రోల్‌పోసి నిప్పటించాడు. లహరి గదిలో నుంచి పెద్ద శబ్దాలు రావడంతో ఆమె అమ్మమ్మ, తాతయ్య తలుపులు తెరిచి చూశారు. అప్పటికే ఆ విద్యార్థిని పూర్తిగా కాలిపోయి మృతి చెంది ఉంది. సగం వరకు శరీరం కాలిన రాఘవేంద్ర పారిపోతుండడంతో చు ట్టుపక్కల వారి సహాయంతో పట్టుకొని పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే అతన్ని అంబులెన్స్‌లో కర్నూలు ప్రభుత్వాస్పత్రికి పో లీసులు తరలించారు. లహరి ఒంటిపై పెట్రోల్ పోసి నిప్పంటినప్పుడు రాఘవేంద్ర గాయపడి ఉంటాడని స్థానికులు భావిస్తున్నారు. వెల్దుర్తిలో లహరి, రాఘవేంద్ర కలిసి పదో తరగతి వరకు చదివారు. వెల్దుర్తికి చెందిన రాఘవేంద్రరావు ఈ పరిచయాన్ని ఉపయోగించు కొని ప్రేమ పేరుతో లహరిని వేధించేవాడు. లహరి సొంత గ్రామం వెల్దుర్తి మండలం రామళ్లకోటలోని అమ్మమ్మ, తాతయ్య ఇంట్లో ఉంటూ ఇంటర్ చదువుతోంది. సంఘటనా స్థలాన్ని నంద్యాల జిల్లా ఎస్‌పి ఆదిరాజ్ సింగ్ రాణా పరిశీలించారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. రాఘవేంద్ర పరిస్థితి కూడా విషమంగా ఉందని తెలిపారు. త్వరలో అన్ని విషయాలూ వెల్లడిస్తామని చెప్పారు. సంఘటనా స్థలాన్ని ఎమ్మెల్యే గిత్త జయసూర్య పరిశీలించారు. నిందితుడిని కఠినంగా శిక్షిస్తామన్నారు. రాఘవేంద్రరావు టెన్త్ తర్వాత చదువు ఆపేసి పువ్వుల వ్యాపారం చేస్తున్నాడు.
విద్యార్థుల నిరసన ప్రదర్శన
ఈ ఘటన నేపథ్యంలో నందికొట్కూరు జూనియర్ కాలేజీ వద్ద ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యాన విద్యా ర్థులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ నంద్యాల జిల్లా కార్యదర్శి ఎంఆర్ నాయక్ మాట్లాడుతూ లహరిని హత్య చేసిన యువకుడిని కఠినంగా శిక్షించాలని, ఈ ఘటనపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. విద్యార్థిని కుటుంబానికి రూ.50 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా గట్టి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.
హోంమంత్రి ఆగ్రహం
ప్రేమించలేదనే కారణంతో ఇంటర్ విద్యార్థిని లహరిపై రాఘవేంద్ర అనే యువకుడు పెట్రోల్ పోసి నిప్పంటించి హత్య చేసిన ఘటనపై సమగ్ర విచారణ చేపట్టాలని రాష్ట్ర హోంమంత్రి అనిత ఆదేశించారు. ఉన్మాద చర్య పట్ల ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనలో విద్యార్థిని మృతి చెందడం అత్యంత బాధాకరమని పేర్కొన్నారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. నంద్యాల జిల్లా ఎస్‌పితో ఫోన్‌లో మాట్లాడానని, ఈ ఘటనపై వివరాలు అడిగి తెలుసుకున్నానని, సంఘటనా స్థలాన్ని పరిశీలించాలని ఎస్‌పిని ఆదేశించానని పేర్కొన్నారు.