తుని (కాకినాడ) : కాకినాడ జిల్లా తునిలో బాలుడి కిడ్నాప్ కలకలం రేపింది. తునిలోని స్థానిక భాష్యం స్కూల్లో దాడిశెట్టి పరమేష్ (6) అనే బాలుడు ఒకటో తరగతి చదువుతున్నాడు. సోమవారం ఉదయం పరమేష్‌ను తండ్రి సురేష్ స్కూల్‌లో వదిలిపెట్టాడు. ఉదయం 10 గంటల 30 నిముషాలకు దుండగులు వచ్చి బాబు పరమేష్‌కు టానిక్ పట్టించాలని చెప్పి … స్కూల్ నుండి బయటకు తెచ్చి బైక్ పై తీసుకెళ్లారు. మధ్యాహ్నం బాలుడి తల్లిదండ్రులు లంచ్ బాక్స్ తెచ్చి చూడగా, స్కూల్‌లో బాలుడు కనిపించలేదు. స్కూల్ మొత్తం గాలించినప్పటికి బాలుడి ఆచూకీ కనిపించకపోవడంతో పాఠశాల యాజమాన్యాన్ని నిలదీయగా టానిక్ పట్టించాలని చెప్పి.. కొందరు వచ్చి తీసుకెళ్లారని తెలపడంతో.. తక్షణమే, తుని పోలీసులకు బాలుడి తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. దీంతో, కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాబు ఆచూకీ కోసం గాలిస్తున్నారు.. అసలు ఎవరో తెలియకుండా స్కూల్ నుంచి బాబుని ఎలా బయటికి పంపించారంటూ … బాలుడి తల్లిదండ్రులు భాష్యం స్కూల్ యాజమాన్యాన్ని నిలదీశారు. పోలీసులు, బాలుడి తల్లిదండ్రులు, బంధువులు బాలుడి ఆచూకీ కోసం గాలిస్తున్నారు.
