సోదరులే చంపేశారు

Feb 14,2025 23:03 #Crimes in AP

 సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ హత్య కేసులో నిందితులు అరెస్టు
ప్రజాశక్తి-విజయనగరం ప్రతినిధి : విజయనగరం జిల్లా తెర్లాం మండలం నెమలాం గ్రామ శివారులో ఈ నెల 10న జరిగిన సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ కోనారి ప్రసాద్‌ (28) హత్య మిస్టరీని పోలీసులు ఛేదించారు. వరుసకు సోదరులైన పెద్దనాన్న కుమారులే ఈ దారుణానికి ఒడిగట్టారు. శుక్రవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఎస్‌పి వకుల్‌ జిందాల్‌ ఈ ఘటనకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. ఈ దారుణానికి ప్రసాద్‌ పెదనాన్న కుమారులు కోనారి అచ్యుతరావు (32), కోనారి శివకృష్ణ (27) ఒడిగట్టినట్లు విచారణలో తేలింది. అచ్యుతరావు భార్య వెంకటలక్ష్మితో ప్రసాద్‌కు వివాహేతర సంబంధం ఉన్నట్లు నిందితులకు తెలియడంతో ఆయనను హతమార్చాలని పన్నాగం పన్నారు. ఫిబ్రవరి ఏడున గ్రామంలోకి ప్రసాద్‌ వచ్చినట్లు నిందితులు తెలుసుకున్నారు. పదవ తేదీ అచ్యుతరావు ఇంటికి ప్రసాద్‌ వచ్చారు. అక్కడి నుంచి తన మేనమామ ఊరు బూరిపేట గ్రామానికి వెళ్లారు. తిరుగు ప్రయాణంలో తమను కలవాలని నిందితులిద్దరూ ప్రసాద్‌ను కోరారు. బూరిపేట గ్రామ సమీపంలోని రేవడి పొలాల వద్ద అందరూ కలుసుకున్నారు. పథకం ప్రకారం ప్రసాద్‌ తలపై కర్రతో దాడి చేశారు. నిందితుల నుంచి ప్రసాద్‌ తప్పించుకుని కాలువలో పడిపోయారు. ప్రసాద్‌ను వెంటాడి మరోసారి తలపై కర్రలతో దాడి చేసి, హత్య చేశారు. మృతదేహాన్ని రహదారిపై పడేసి, రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు నిందితులు ప్రయత్నించారు. నిందితులిద్దరినీ పోలీసులు అరెస్టు చేశారు.

➡️