లింగాపురంలో వ్యక్తి దారుణ హత్య

Mar 22,2025 21:25 #Hatya, #Nandyala district
  • వేట కొడవళ్లతో నరికి చంపిన వైనం

ప్రజాశక్తి – బండి ఆత్మకూర్‌ (నంద్యాల) : నంద్యాల జిల్లా బండి ఆత్మకూరు మండలం లింగాపురం గ్రామానికి చెందిన నంద్యాల సుధాకర్‌ రెడ్డి (52) దారుణ హత్యకు గురయ్యాడు. అదే గ్రామానికి చెందిన గుర్రాల రామస్వామి, అతని ఇద్దరు కుమారులు శివ, తిరుపాలుతో పాటు మరో ముగ్గురు కలిసి వేటకొడవళ్లతో దారుణంగా నరికి హత్య చేశారు. జిల్లా ఎఎస్‌పి మందాజావలి ఆల్ఫోన్స్‌ తెలిపిన వివరాల మేరకు… మండలంలోని జిసి పాలెం-నారాయణపురం గ్రామాల మధ్య ఉన్న పొలం చూసేందుకు శనివారం ఉదయం సుధాకర్‌రెడ్డి తన మోటార్‌ సైకిల్‌పై భార్యతో కలిసి వెళ్లారు. తిరిగి వచ్చే క్రమంలో జిసి పాలెం సమీపాన కొత్తచెరువు వద్ద అప్పటికే కాపుకాసిన గుర్రాల రామస్వామి, అతని ఇద్దరు కుమారులతో పాటు మరో ముగ్గురు వేట కొడవళ్లతో, గొడ్డళ్లతో సుధాకర్‌ రెడ్డిపై దాడి చేశారు. తీవ్రగాయాలతో సుధాకర్‌రెడ్డి అక్కడికక్కడే మృతి చెందారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. గతంలో వీరిరువురి మధ్య నెలకొన్న భూ వివాదం నేపథ్యంలో ఈ హత్య జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టామని ఎఎస్‌పి తెలిపారు.

➡️