ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : జండర్ బడ్జెట్‌తోనే మహిళా సాధికారత సాధ్యమవుతుందన్న ప్రజాభిప్రాయాన్ని, ఐరాస సూచనలను బడ్జెట్‌లో పెడచెవిన పెట్టడం శోచనీయమని ఐద్వా రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు బి ప్రభావతి, డి రమాదేవి పేర్కొన్నారు. గ్రామీణ మహిళలకు ఎంతో కొంత ఉపాధి కల్పిస్తున్న ఉపాధి హామీ పథకానికి అవసరమైన నిధులను కేటాయించలేదని శనివారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. ఎన్‌ఎస్‌ఎస్ సర్వేలో మహిళల అప్పులు విపరీతంగా పెరిగాయన్న నివేదికలున్నాయని తెలిపారు. పొదుపు మహిళలకు తక్కువ వడ్డీతో రుణాల పెంపునకు బడ్జెట్‌లో కేటాయింపులు లేవన్నారు. హింస, అత్యాచారాలు విపరీతంగా పెరుగుతున్నాయని, కానీ నిర్భయకు నిధుల కేటాయింపు లేదన్నారు. జండర్ బడ్జెట్‌గా చూపిన నిధులతో 75 శాతం ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద చూపడంతో మిగిలిన మహిళా పథకాలన్నీ అటకెక్కించారని తెలిపారు. మహిళా, శిశు సంక్షేమ శాఖకు కేటాయించింది రూ.26,889 కోట్లు మాత్రమేనని ఇది బడ్జెట్‌లో కేవలం 0.53 శాతమన్నారు. గతేడాది కంటే తక్కువ వాటా కేటాయించారని తెలిపారు. ఐసిడిఎస్‌కు రూ.21,960 కోట్లు మాత్రమే కేటాయించారని చెప్పారు. వ్యాపారం చేసుకునే 5 లక్షల మంది మహిళలకు అప్పులిస్తామని ప్రకటించారని, గతంలో ఎంఎస్‌ఎంఇ పథకం కింద 48 యూనిట్లు మూత పడ్డాయన్నారు. చిన్న తరహా వ్యాపారాలు, తయారీ పరిశ్రమలకు రక్షణ లేకుండా ప్రకటించే చర్యలు కంటి తుడుపు మాత్రమేనన్నారు.
