- విద్యుత్ వినియోగదారుల ఐక్యవేదిక
- మంత్రికి విజ్ఞప్తి
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : విద్యుత్ వినియోగదారులపై ఎఫ్‌పిపిసిఎ భారం మోపొద్దని రాష్ట్ర ప్రభుత్వాన్ని విద్యుత్ వినియోగదారుల ఐక్యవేదిక కోరింది. ఈ మేరకు విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ను వేదిక నాయకులు సచివాలయంలో బుధవారం కలిసి వినతిపత్రం అందించారు. ఎఫ్‌పిపిసిఎ రూ.6,072.86 కోట్లు ప్రభుత్వమే భరించాలని, రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే బడ్జెట్‌లో ఈ కేటాయింపులు జరపాలని కోరారు. ఎఫ్‌పిపిసిఎ విధానాన్నే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఎఫ్‌పిపిసిఎ, ట్రూఅప్ ఛార్జీలకు మూలం విద్యుత్‌ను ప్రైవేట్ రంగం నుంచి కొనడంతో అధిక ధరకు బొగ్గు కొనుగోలు చేయడమని వివరించారు. జెన్‌కోకు 76,992 మిలియన్ యూనిట్లు(ఎంయు) ఉత్పత్తి చేసే సామర్ధ్యం ఉన్నా కేవలం 24,416 ఎంయులు మాత్రమే డిస్కమ్‌లకు అందుతుందని పేర్కొన్నారు. ప్రైవేట్ రంగం నుంచి 45,265 ఎంయులు కొనుగోలు చేస్తున్నారని తెలిపారు. పెరుగుతున్న విద్యుత్ డిమాండ్‌కు అనుగుణంగా ప్రభుత్వ రంగంలో మరిన్ని ఉత్పత్తి స్టేషన్లను నిర్మిస్తే ప్రజలపై ఈ భారాలు తగ్గుతాయని సూచించారు. స్మార్ట్ మీటర్ల ఏర్పాటు ప్రతిపాదనను విరమించుకోవాలని కోరారు. మంత్రిని కలిసిన వారిలో వేదిక కన్వీనర్ ఎంవి ఆంజనేయులు, ఎఫ్‌ఎపిఎస్‌ఐఎ కోశాధికారి జి వెంకటేశ్వరరెడ్డి, ట్యాక్స్ పేయర్స్ అసోసియేషన్ అధ్యక్షులు వి సాండిరెడ్డి, పెన్షనర్స్ అసోసియేషన్ నాయకులు ఎంఎన్ పాత్రుడు, ట్యాక్స్ పేయర్స్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ వి శ్రీనివాస్ పాల్గొన్నారు.