- యుటిఎఫ్ రౌండ్ టేబుల్ సమావేశంలో విఠపు బాలసుబ్రహ్మణ్యం
ప్రజాశక్తి-అమరావతిబ్యూరో : భాష విషయంలో పెత్తందారీ విధానాన్ని కేంద్రం మానుకోవాలని పిడిఎఫ్ మాజీ ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రహ్మణ్యం హితవు పలికారు. పిల్లలు ఏ భాషలు నేర్చుకోవాలనే అంశంపై ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకే పూర్తి అధికారం ఉండాలని అన్నారు.. ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (ఎపియుటిఎఫ్) ఆధ్వర్యంలో విజయవాడ యుటిఎఫ్ రాష్ట్ర కార్యాలయంలో ‘జాతీయ విద్యావిధానం- భాషా విధానం’ అంశంపై గురువారం రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఆ సంఘ రాష్ట్ర అధ్యక్షులు ఎన్. వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ కేంద్రం హిందీని నేర్చుకుని తీరాలంటూ చేస్తున్న ఒత్తిడికి వ్యతిరేకంగా తమిళనాడు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేయడంతో దేశ వ్యాప్తంగా ఈ అంశం చర్చనీయాంశంగా మారిందని తెలిపారు. భాష విషయంలో రాష్ట్రాలకు పూర్తి స్వేచ్చ ఇవ్వకపోతే అనవసరంగా అలజడులు రేగి కొత్త సమస్యలు తీసుకొచ్చినట్లవుతుందన్నారు. ఇది ఫెడరల్ స్పూర్తికి, ఆయా రాష్ట్రాల స్వేచ్చ స్వాతంత్రాలకు, ఆయా రాష్ట్రాల్లోని పిల్లల అవసరాలకు విరుద్దమని తెలిపారు. ఎంతో ప్రభావవంతమైన భాష విషయంలో కేంద్రం రాష్ట్రాలకు సూచనలు చేయాలని , అది రాష్ట్రాలకు ఐచ్చికంగా మాత్రమే ఉండాలన్నారు. హిందీ అవసరం లేదని చెబుతున్న తమిళనాడుకు సర్వశిక్ష అభియాన్ నిధులు నిలిపివేయడానికి కేంద్రం ఉత్తర్వులు ఇవ్వడం ఆందోళన కలిగిస్తోందని చెప్పారు. ఫెడరల్ రాజ్యాంగం, భాషా ప్రయుక్త రాష్ట్రాలుగా ఏర్పడిన దేశంలో కేంద్రం ఏ రాష్ట్రాన్నయినా ఫలానా భాష నేర్చుకోవాలని ఒత్తిడి చేసి, కాదంటే నిధులు నిలిపివేస్తామని హుకుం జారీ చేయడం సరైనది కాదన్నారు. బహుళ భాషా సంస్కృతులున్న దేశంలో భాష పేరుతో ఒక ఆదిపత్యాన్ని చలాయించాలని ప్రయత్నం చేస్తే సహజంగానే ఆ భాష , సంస్కృతుల మీద ప్రేమ ఉన్నవాళ్లు తిరుగుబాటు చేసే పరిస్తితులు ఉంటాయని అన్నారు. బంగ్లాదేశ్‌లో ఉర్దుకు వ్యతిరేకంగా, యుగోస్లోవియాతో పాటు ప్రపంచంలోని పలు దేశాలు భాషా ప్రాతిపదికనే ఆందోళనలు జరిగి విభజనకు గురయ్యాయని గుర్తు చేశారు. త్రి భాష సూత్రాన్ని చెబుతూ దక్షిణాది రాష్ట్రాల్లోని వారు ఉత్తరాదికి చెందిన ఒక హిందీని నేర్చుకోవాలని చెప్పినప్పుడు ఉత్తరాధి రాష్ట్రాలు కూడా ఒక దక్షిణాది భాషని కచ్చింతంగా నేర్చుకోవడాన్ని అమలు చేయడానికి సిద్దపడాలన్నారు. భారతీయ భాషల గురించి చెపుతున్న ప్రభుత్వాలు, కార్పొరేట్, ప్రయివేట్ స్కూల్స్‌లో మాతృభాషకు ప్రాధాన్యత ఇవ్వడ లేదని జాతీయ భాషలను అసలు పట్టించుకోవడం లేదన్న విషయాన్ని గుర్తించకపోవడం శోచనీయమన్నారు. సమావేశానికి అధ్యక్షత వహించిన ఎన్. వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఫెడరల్ వ్యవస్తలో విద్యారంగంలో ఏ నిర్ణయం అయినా రాష్ట్రాలతో సంప్రదించి కేంద్రం తీసుకోవాలన్నారు. భాష విషయంలో కేంద్రం పెత్తనం చేసేలా వ్యవహరించడాన్ని యుటిఎఫ్ వ్యతిరేకిస్తుందని అన్నారు. భాష పేరుతో కేంద్రం రాష్ట్రాలకు రావాల్సిన నిధులను నియంత్రించాలని చూడటం అప్రజాస్వామికమన్నారు. ఎపిటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఎస్. చిరంజీవి, ఎపియుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎస్.పి.మనోహర్‌కుమార్, ˜్ ప్రచురణ కమిటీ చైర్మన్ ఎం. హనుమంతరావు, కెవిపిఎస్ రాష్ట్ర కారదర్శి ఆండ్ర మాల్యాద్రి తదితరులు రౌండ్ టేబుల్ సమావేశంలో మాట్లాడారు.