ప్రజాశక్తి-తిరుమల : శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో తొలిరోజైన శుక్రవారం రాత్రి రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రభుత్వం తరఫున శ్రీవేంకటేశ్వరస్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. ముందుగా ముఖ్యమంత్రి బేడి ఆంజనేయస్వామివారి ఆలయం వద్దకు చేరుకున్నారు. అక్కడినుంచి మంగళవాయిద్యాల నడుమ ఊరేగింపుగా శ్రీవారి ఆలయం వద్దకు చేరుకున్నారు. టీటీడీ ఈవో జె.శ్యామలరావు, అదనపు ఈవో సిహెచ్ వెంకట చౌదరి స్వాగతం పలికారు. ఆ తరువాత ముఖ్యమంత్రి ధ్వజస్తంభానికి నమస్కరించుకుని శ్రీవారిని దర్శించుకున్నారు. వకుళామాత, విమాన వేంకటేశ్వరస్వామి, భాష్యకార్ల సన్నిధి, యోగ నరసింహస్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేదమంత్రోచ్ఛారణతో వేద పండితులు ఆశీర్వదించారు. టీటీడీ ఈఓ ముఖ్యమంత్రి గారికి శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి రామ్ నారాయణ రెడ్డి పాల్గొన్నారు.రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ సత్యనారాయణ, తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర, ఎస్పీ సుబ్బరాయుడు తదితరులు పాల్గొన్నారు. టిటిడి అధికారులు పాల్గొన్నారు.
