ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : రాజధాని ప్రాంతంలో కొత్తగా భూములు సమీకరించాలని ప్రతిపాదించిన రాష్ట్ర ప్రభుత్వం పూలింగ్ చట్టంలో కీలక సవరణ చేసింది. ఇప్పటి వరకూ రైతులకు తిరిగి ఇచ్చే ప్లాట్లను లాటరీ పద్ధతిలో కేటాయిస్తుండగా, తాజా సవరణలో కమిషనర్ ఇష్టానికి వదిలివేసింది. ఈ మేరకు జారీ చేసిన ఉత్తర్వులు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. అథారిటీ చట్టం రూల్‌లో పేర్కొన్న షెడ్యూల్ 11(1)(ఐ)(సి) ప్రకారం ఇప్పటి వరకూ పూలింగు చట్టం కింద ప్లాట్లను పూర్తి లాటరీ పద్ధతిలో పారదర్శకంగా కేటాయించాల్సి ఉంది. కొత్తగా చేసిన సవరణ ప్రకారం ప్లాట్ల కేటాయింపును లాటరీ లేదా పారదర్శకతతో కూడిన ఇంకేపద్ధతినైనా ప్రభుత్వం లేదా సిఆర్‌డిఏ కమిషనర్ నిర్ణయం మేరకు చేయొచ్చని సవరించారు. పూలింగు చట్టం తెచ్చిన సమయంలో సిఆర్‌డిఏ చట్టంలో ఛాప్టర్ ఏడులో సెక్షన్ 48(5)(సి)(ప్లాట్ల పునర్నిర్మాణం) కింద లాటరీ పద్ధతిలో కేటాయించాలని నిర్ణయించారు. దీనికోసం 2016లో అథారిటీలో 36వ నెంబరుతో తీర్మానం చేశారు. దీనిపై 2016లోనే జిఓ నెంబరు 207 తీసుకొచ్చారు. దీని ప్రకారం ప్లాట్లను 120 చదరపు గజాల నుండి 25 వేల చదరపు గజాల వరకూ కేటాయించేలా నిర్ణయం తీసుకున్నారు. డైనమిక్ పద్ధతిలో ప్లాట్ల కేటాయింపు చేసేందుకు ఎపి ఆన్‌లైన్ లిమిటెడ్‌తో జాయింట్ అగ్రిమెంటు చేసుకున్నారు. భూమి తాలూకా 9.14 అగ్రిమెంటు చేసుకున్న తరు వాత రైతులిచ్చిన ఆప్షన్ల మేరకు వారికి ప్లాట్ల్ల విస్తీర్ణం వారీగా లాటరీ తీసి కేటాయింపులు జరిపేశారు. ఇదంతా ఆన్‌లైన్ పద్ధతిలో జరిగేది. ఒకసారి గ్రామాన్ని సెలక్ట్ చేసి రైతులు కోరుకున్న ఆప్షన్లు ఇచ్చేసి అందరి ముందూ ఆన్‌లైన్‌లోనే లాటరీ బటన్ నొక్కగానే ప్లాట్లనెంబర్లు వారి ప్లాట్లవిస్తీర్ణం ప్రకారం మంజూరయ్యేవి. ఎవరికి ఏ ప్లాట్లు ఇస్తే జిఐఎస్‌లో ఉన్న నెంబర్ ఆధారంగా వారికి ధృవీకరణపత్రం ఇచ్చేవారు. అయితే రోడ్డు శూల ఉన్న ప్లాట్ల యజ మానులు అభ్యంతరం వ్యక్తం చేస్తే వారికి అందు బాటులో ఉన్న ప్లాట్లను తిరిగి కేటాయించేవారు. ఈ పద్ధతిపై అప్పట్లోనూ రైతుల నుండి అభ్యంతరాలు వచ్చాయి. అధికారులకు అనుకూలంగా ఉన్న వారికి ఒకచోట, లేనివారికి మరోచోట ప్లాట్లు ఇచ్చారని ఫిర్యాదులూ చేశారు. శాఖమూరు, ఐనవోలు గ్రామాల్లో రైతులు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. అనంతరం ప్రభుత్వం మారిన తరువాత ఎటువంటి లావాదేవీలు జరగలేదు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం, ఇప్పుడున్న రాజధానికి తోడు అదనంగా భూమిని సమీకరించాలనే ప్రతిపాదన రావడంతో మరలా ప్లాట్ల కేటాయింపు అంశం కీలకంగా మారింది. ఈ సమయంలో గతంలో ఉన్న పద్ధతిలో కాకుండా ప్రభుత్వం లేదా కమిషనర్ వారికి ఇష్టం వచ్చిన పద్ధతిలో కేటాయింపులు జరపొచ్చని తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
