ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : సర్వేలు, రీసర్వే పేర్లతో భారాల మీద భారాలు పడుతున్న గ్రామ సర్వేయర్లు సమస్యల పరిష్కారం కోసం పోరుబాట పట్టనున్నారు. ఇందులో భాగంగా ఈనెల 9న విజయవాడలో భారీ ధర్నా చేపట్టనున్నారు. ఇప్పటికే ఈ నెల 4న కలెక్టర్లను కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నా ప్రభుత్వం నుంచి ఆశించిన స్థాయిలో ఫలితం రాలేదని, అందుకే ఉద్యమబాట పట్టాల్సివస్తోందని గ్రామ సర్వేయర్లు తెలిపారు. తరాల నుంచి రెవెన్యూ రికార్డుల్లో దొర్లిన తప్పులను సరిచేయకుండా భూముల రీసర్వే చేయాలనడం, గత తప్పులకు ఇప్పుడు గ్రామ సర్వేయర్లను బాధ్యులు చేయడం ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు. ప్రతి గ్రామ సర్వేయర్‌కు ఒక లాప్‌టాప్, ఇతర ఎక్విప్‌మెంట్ ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నారు. భూముల సర్వేకు అదనంగా ప్రభుత్వం ఆదేశిస్తున్న పలు సర్వేలను కూడా తామే చేయాలంటూ తమను మల్టీపర్పస్ రీసోర్స్‌గా పని చేయాలంటూ అధికారుల నుంచి ఒత్తిళ్లు ఎదురౌతున్నాయని వాపోతున్నారు. సర్వేలో పాల్గొనకపోతే షోకాజ్ నోటీసులు, మెమోలు ఇస్తున్నారని తెలిపారు. స్వర్ణాంద్ర విజన్-2047 అమలులో భాగంగా గ్రామ సచివాలయాల్లో మిగులు సిబ్బందని ప్రభుత్వం నోటిఫై చేసింది. ఇందులో అత్యధికంగా గ్రామ సర్వేయర్లు (గ్రేడ్-3) 4,722మంది ఉన్నట్లు తేల్చారు. మిగులు సిబ్బందిని ఎక్కడ ఎలా సర్ధుబాటు చేస్తారనే విషయంపై ప్రభుత్వం నుంచి స్పష్టత రాలేదని వారు పేర్కొంటున్నారు. భూ యాజమాన్యహక్కులను నిర్దారించే అధికారులను సర్వే శాఖ తరపున నియమించేలా శాఖాపరమైన సంస్కరణలు చేపట్టాల్సి ఉందని క్షేత్రస్ధాయి రెవెన్యూ సిబ్బంది నుంచి డిమాండ్ వినిపిస్తోంది. అర్హత గల గ్రామ సర్వేయర్లందరికీ తక్షణమే పదోన్నతులు కల్పిచడంతో పాటు పనిభారాన్ని తగ్గించాలని లేని పక్షంలో తాము ఉద్యోగ నిర్వహణలో ముందుకు సాగడం ఇబ్బందికరంగా మారుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామ సచివాలయాల్లో పనిచేస్తున్న గ్రామ స ర్వే సిబ్బందిని మాతృశాఖ అయిన సర్వే, భూ రికార్డుల శాఖలోకి మార్చాలని గ్రామ సర్వేయర్లు విజ్ఞప్తి చేస్తున్నారు. రీ సర్వే జరుగుతున్న గ్రామాల్లో గ్రామ సరిహద్దులను, ప్రభుత్వ భూములు అన్నీ కూడా నిర్ధారించిన తర్వాత మండల లెవల్ సర్వేఆఫీసరు (ఎంఎల్‌ఎస్‌ఓ), 30 వాతం డిప్యూటీఇనెస్పెక్టర్ ఆఫ్ సర్వేయరు (డిఐఓఎస్) భూమి మీద పరిశీలించాల్సి ఉంటుంది. అనేక ప్రాంతాల్లో క్షేత్రస్ధాయి పరిశీలన సక్రమంగా లేక పోవడంతో రైతులకు సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తోంది. ఫలితంగా ఆ ఫ్రభావం గ్రామ సర్వేయర్ల పడుతోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
