- మండలి చైర్మన్ సూచన
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : విద్యలో రాజ్యాంగాన్ని ఒక సబ్జెక్టుగా తీసుకురావాలని శాసనమండలి చైర్మన్ కె మోషేనురాజు విద్యాశాఖమంత్రి నారా లోకేష్‌కు సూచించారు. విద్య సంస్కరణలపై శాసనమండలిలో బుధవారం జరిగిన చర్చ సందర్భంగా చైర్మన్ జోక్యం చేసుకుంటూ ఈ సూచన చేశారు. సమాజంలో రాజ్యాంగంపై ఒక అపోహ కొనసాగుతోందన్నారు. దీనివల్ల రెండు వర్గాలుగా విడిపోయే విధానం కొనసాగుతుందన్నారు. రాజ్యాంగాన్ని ఒక సబ్జెక్టుగా ప్రవేశపెడితే దానిపై ఉన్న అపోహ తొలిగి విద్యార్ధులందరూ స్నేహాభావంతో ఉంటారని సూచించారు.చత్తీస్‌ఘడ్, ఢిల్లీ వంటి రాష్ట్రాలు ఇప్పటికే ఒక సబ్జెక్టుగా విద్యార్ధులకు ప్రవేశపెట్టాయని తెలిపారు. రాష్ట్రంలో కూడా ప్రవేశపెడితే రాజ్యాంగంపై గౌరవం పెరిగేందుకు, చట్టాలపై అవగాహన చేసుకునే అవకాశం ఉందన్నారు. పెద్దమనసుతో రాజ్యాంగాన్ని సబ్జెక్టుగా పరిచయం చేయాలని సూచించారు. వైద్య, విద్యలలో సమాజంలో సామాజిక అసమానతలు కొనసాగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. పెద్దలకు ఒక్కలా, పేదలకు మరోలా జరుగుతోందని, దీనిని ఎలా సమాంతరం చేస్తారో వివరంగా చెప్పాలని కోరారు. రాజ్యాంగ లక్ష్యాలను తెలిపే పీఠికను ఉన్నత పాఠశాల స్థాయి నుంచి పిజి వరకు ఒక పేజి ముద్రించాలని పిడిఎఫ్ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు సూచించారు.