దేశంలో రాజ్యహింస అవధులు దాటింది

Feb 9,2025 23:12 #Prof Haragopal, #Virasam

ప్రొఫెసర్‌ హరగోపాల్‌
ప్రజాశక్తి -కర్నూలు కల్చరల్‌ : ఫాసిజం దేశంలో నలుమూలల విస్తరించిందని, తద్వారా రాజ్యహింస అవధులు దాటిందని ప్రొఫెసర్‌ హరగోపాల్‌ అన్నారు. విరసం 24వ సాహిత్య పాఠశాల బహిరంగ సభ ఆదివారం కర్నూలులో జరిగింది. ఈ సభలో ప్రధాన వక్తగా హరగోపాల్‌ హాజరై మాట్లాడారు. రచయితల దృక్పథంలో మార్పురావడం కాదని, ప్రవర్తనలో మార్పు రావాలని అన్నారు. భారతీయ సమాజంలో అంబేద్కర్‌ తర్వాత గొప్ప మేధస్సు కలిగిన వ్యక్తిగా వరవరరావ్‌ కనపడతాడని, సాహిత్యంలో ప్రధాన భూమిక పోషించి ఉంటే ఆయనకు జ్ఞానపీఠ పురస్కారం వచ్చేదని తెలిపారు. విప్లవోద్యమం నిర్మించేవారు ఎవరంటే విలువలకు నిలబడే వారు, నిజాయితీ గలవారు, త్యాగాలు చేసేవారు, ఆచరణలో చూపేవారని అన్నారు. దీనికి ఉదాహరణగా సాయిబాబాని పేర్కొనవచ్చని తెలిపారు. గ్రాంసీ తర్వాత అంత గొప్ప మేధస్సు కలిగిన వ్యక్తి భారతీయ సమాజంలో ఎవరైనా ఉన్నారంటే ఆయన సాయిబాబా మాత్రమే అని అన్నారు. గ్రాంసీ జీవితానికి సాయిబాబా జీవితానికి సారూప్యత ఉందని తెలిపారు. అందుకే సాయిబాబా పట్ల డాక్టర్లకు, న్యాయమూర్తులకు, గవర్నర్లకు సానుభూతి ఉండేదని వివరించారు. గుజరాత్‌ నమూనా ఎంత దుర్మార్గమైనదో మనందరికీ తెలుసని, అటువంటి నమూనాన్ని దేశమంతా రుద్దుతామనడం దుర్మార్గానికి సంకేతమని అన్నారు. కుంభమేళాలో వేల మంది చనిపోతే దేనికి నిదర్శనమని తెలిపారు. కుంభమేళాలో 40 కోట్ల మంది మునిగితే దేశం ఎందుకు విముక్తి అవ్వలేదని ప్రశ్నించారు. మూఢత్వాలు అభివృద్ధి చెందుతుంటే మనం ఎదుర్కోవడంలో విఫలమయ్యామని తెలిపారు. మేథావులు జ్ఞానాన్ని భాషగా మార్చాలన్నారు. పాటను పాడటం వేరు, సృష్టించడం వేరని తెలిపారు. ఇటీవల కాలంలో రచయితలు ప్రజలకు దగ్గరయ్యే సాహిత్యాన్ని సృష్టిస్తున్నారని, ఇది ఆశాజనకంగా భావిస్తున్నానని తెలిపారు. బహిరంగ సభకు నాగేశ్వరాచారి అధ్యక్షత వహించారు. ఈ సభలో దాదాపు 27 పుస్తకాలను ఆవిష్కరించారు. తెలుగు సాహిత్యంలో వెలుగునీడలు అన్న అంశంపై వరలక్ష్మి అధ్యక్షత వహించగా విరసం రాష్ట్ర అధ్యక్షులు అరసవిల్లి కృష్ణ మాట్లాడారు. మధ్యాహ్నం విప్లవోద్యమంపై ఫాసిస్ట్‌ యుద్ధం- బుద్ధి జీవుల పాత్ర అంశంపై సాగర్‌ అధ్యక్షత వహించగా పాణి మాట్లాడుతూ ప్రజల గుండెలపై కార్పొరేట్‌ మొక్కలను నాటుతున్నారని, రాజ్యాంగం పరువు తీస్తున్నారని తెలిపారు.

➡️