- యువకుడి మృతి, యువతికి తీవ్ర గాయాలు
ప్రజాశక్తి – పాలకొల్లు : రైలు కింద పడి ఓ ప్రేమజంట ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు పట్టణ శివారులో శుక్రవారం వెలుగుచూసింది. ఈ ప్రమాదంలో యువకుడు అక్కడికక్కడే మృతి చెందగా, యువతి తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. భీమవరం పట్టణ శివారు దుర్గాపురానికి చెందిన వెన్నెల రాజేష్ (20), గణపవరం మండలం ఎస్.కొండేపాడుకు చెందిన యువతి…భీమవరంలోని ఓ షాపింగ్ మాల్‌లో కలిసి పని చేస్తుండగా ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. పెళ్లికి పెద్దలు అంగీకరించలేదు. దీంతో ఇరువురూ గురువారం రాత్రి పాలకొల్లు చేరుకున్నారు. రైల్వే గేటు వద్ద నుంచి గోరింతాడ వైపు రైల్వేట్రాక్‌పై నడుచుకుంటూ వెళ్తుండగా రైలు వచ్చే సమయానికి యువతిని యువకుడు పక్కకు తోసేయడంతో ఆమె గాయాలతో బయటపడింది. ఈ ఘటనలో యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారమివ్వడంతో వారు యువతిని పాలకొల్లు ప్రభుత్వాస్పత్రికి, మెరుగైన వైద్యం కోసం తణుకు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. రైల్వే పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. యువకునికి ఇప్పటికే వివాహమై భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నట్లు సమాచారం.