ఉగ్రవాదానికి మతం లేదు

దానిని కఠినంగా ఎదుర్కోవాలి
కానీ, పరిస్థితులను ఉద్రిక్తంగా మార్చకూడదు
పాకిస్తాన్‌పై అంతర్జాతీయ ఒత్తిడి తేవాలి
విలేకరుల సమావేశంలో ఎంఎ బేబి

ప్రజాశక్తి- తిరుపతి బ్యూరో :  ‘ఉగ్రవాదానికి మతం ఉండదు. మతం పేరుతో ఉగ్ర దాడులు జరుగుతున్నా ఏ మతమూ ఉగ్రవాదాన్ని బోధించదు. కొన్ని శక్తులు దీనిని వాడుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. ఉగ్రవాదాన్ని కఠినంగా ఎదుర్కోవాలి. కానీ పరిస్థితులను మరింత ఉద్రక్తంగా మార్చకూడదు. ప్రజల మధ్య విభేదాలు, విద్వేషాలు రెచ్చగొట్టే చర్యలను అరికట్టాలి.’ అని సిపిఎం ప్రధాన కార్యదర్శి ఎంఎ బేబి అన్నారు. తిరుపతిలో జరుగుతున్న సిపిఎం రాష్ట్ర కమిటీ సమావేశాలకు హాజరైన ఆయన శుక్రవారం విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ పహల్గాంలో జరిగిన దారుణ ఉగ్రదాడిని దేశం మొత్తం ఖండించిందని చెప్పారు. ఈ సందర్భంగా అఖిలపక్ష సమావేశంలో సిపిఎం ఎంపి జాన్‌బిట్రాస్‌ చెప్పిన విషయాలను ఆయన ప్రస్తావించారు. ఆ సమావేశంలోనే ఆపరేషన్‌ సిందూర్‌ నిర్ధేశించిన లక్ష్యాలను సాధించినట్లు కేంద్ర రక్షణశాఖ మంత్రి చెప్పిన నేపథ్యంలో సరిహద్దుల్లో పరిస్థితిని సాధారణ స్థితికి తీసుకువచ్చేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. పాకిస్తాన్‌పై అంతర్జాతీయ ఒత్తిడి తీసుకురావాలని, పహల్గాంలో 26 మందిని హత్యచేసిన ఉగ్రవాదులను అప్పగించేటట్లు చూడాలని అన్నారు. ఇదే విషయాన్ని అఖిలపక్షంలో కూడా చెప్పినట్లు తెలిపారు. ‘దేశ సమగ్రత, ప్రజల ఐక్యతను కాపాడుకోవడమే కీలకం. మిలటరీ చర్యలతోపాటు శాంతి చర్చల మార్గాన్ని కూడా చూడాలి. ‘భారతదేశ ప్రజాస్వామ్య పరిపక్వతను ప్రపంచానికి చూపించే సమయం ఇది. ఆ పని చేయాలి. పాకిస్తాన్‌ మరో మార్గాన్ని ఎంచుకుంటే అప్పుడు దానికి తగిన విధంగా స్పందించాల్సి ఉంటుంది.’ అని ఆయన అన్నారు.

సమగ్ర సామాజిక సర్వేగా కులగణన ..
కేవలం బీహార్‌ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని కేంద్రప్రభుత్వం కులగణన కార్యక్రమాన్ని ప్రకటించిం దన్న భావన ప్రజల్లో ఉందని ఎంఎ బేబి చెప్పారు. కులగణన చేపట్టేందుకు అవసరమైన మార్గదర్శకాలు ఇప్పటి వరకు ప్రకటించకపోవడం దీనిని బలపరుస్తోందని తెలిపారు. కేవలం కులగణనతో సమస్య పరిష్కారం కాదని, సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి తదితర స్థితిగతుల అధ్యయనం కూడా కలిపి సమగ్ర సర్వేగా చేస్తే ప్రజల వాస్తవ పరిస్థితి క్షేత్ర స్థాయిలో తెలుసుకోవడానికి వీలవుతుందన్నారు. కులగణనను సమగ్ర సామాజిక సర్వేగా చేపట్టాలని, అందుకు అవసరమైన మార్గదర్శకాలను రూపొందిం చాలని డిమాండ్‌ చేశారు. రానున్న పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల్లో సిపిఎం దీనిపై చర్చ లేవనెత్త నుందని తెలిపారు. అక్టోబర్‌లో జరగనున్న బీహార్‌ ఎన్నికల పోరులో బిజెపి నాయకత్వంలోని ఎన్‌డిఎ మతతత్వ రాజకీయ పార్టీలను ఎదుర్కొనేందుకు విశాల ప్రాతిపదికన ప్రజాస్వామ్య, అభ్యుదయ రాజకీయ శక్తులతో కలసి వామపక్ష పార్టీలు పని చేయనున్నాయని తెలిపారు. కేరళ, తమిళనాడు, పాండిచ్చేరి, పశ్చిమ బెంగాల్‌, అస్సాం రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కేంద్ర కమిటీ సమావేశంలో చర్చించి ఎన్నికల ఎత్తుగడలను రూపొందిస్తామని ఎంఎ బేబి వివరించారు. దేశాభివృద్ధికి, సమైక్యతకు, సమగ్రతకు ముప్పు కలిగించేలా పెచ్చరిల్లుతున్న మతతత్వ శక్తులను ఎదుర్కొనే ప్రధాన లక్ష్యంతో సిపిఎం పోరాటాలు చేయాలని 24వ పార్టీ అఖిల భారత మహాసభలో తీర్మానించినట్లు గుర్తు చేశారు. ప్రస్తుతం బాలల మీద గణనీయమైన మతతత్వ పోకడలు పడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. వీరిని చైతన్య పరిచేందుకు బాలల సంఘాల కార్యక్రమాలపై కేంద్రీకరించి పని చేయనున్నట్లు తెలిపారు. విలేకర్ల సమావేశంలో సిపిఎం తిరుపతి జిల్లా కార్యదర్శి వి.నాగరాజు, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కందారపు మురళి పాల్గొన్నారు.

➡️