- ప్రభుత్వ తీరుపై సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు లోకనాథం మండిపాటు
- కెజిహెచ్‌లో బాధితుల పరామర్శ
ప్రజాశక్తి – విశాఖ కలెక్టరేట్, కోటవురట్ల విలేకరులు : అనకాపల్లి జిల్లా కోటవురట్ల మండలం కైలాసపట్నంలోని బాణసంచా తయారీ కేంద్రంలో సంభవించిన పేలుడులో గాయపడి విశాఖ కెజిహెచ్‌లో చికిత్స పొందుతున్న వారిని ప్రభుత్వం, అధికారులు పట్టించుకోకపోవడం దారుణమని సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు కె.లోకనాథం అన్నారు. కెజిహెచ్‌లో చికిత్స పొందుతున్న వారిని ఆయనతో పాటు పార్టీ అనకాపల్లి జిల్లా కార్యదర్శి జి.కోటేశ్వరరావు, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఎం.అప్పలరాజు సోమవారం పరామర్శించారు. క్షతగాత్రులకు అందుతున్న చికిత్స వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం లోకనాథం మాట్లాడుతూ.. క్షతగాత్రులు ఆస్పత్రిలో చేరిన తర్వాత వారిని పట్టించుకొనే నాథుడే కరువయ్యాడని, మంచినీరు, ఆహారం, ఇతర అవసరాలను ప్రభుత్వాధికారులు తీర్చకపోవడం శోచనీయమన్నారు. కట్టుకోవడానికి బట్టలు కూడా లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని క్షతగాత్రులు సిపిఎం బృందం వద్ద వాపోగా వారికి వెంటనే నాయకులు వస్త్రాలను అందజేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించడంతోపాటు వారు పూర్తిగా కోలుకొనే వరకూ ప్రభుత్వమే అన్ని అవసరాలనూ చూసుకోవాలని డిమాండ్ చేశారు. అనకాపల్లి జిల్లాలో తరుచూ ప్రమాదాలు సంభవిస్తున్నాయని, వాటిని అరికట్టడంలో ప్రభుత్వం, అధికారులు విఫలమౌతున్నారని విమర్శించారు. బాణసంచా తయారీ కేంద్రాల్లో తనిఖీలు నిర్వహించి భద్రతా లోపాలు ఉన్నచోట వెంటనే చర్యలు తీసుకోకపోవడం వల్లే ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతున్నాయన్నారు. మృతుల కుటుంబాలకు రెండు ఎకరాల భూమితో పాటు ఇల్లు లేని వారికి ఇల్లు మంజూరు చేసి వారి పిల్లలకు మెరుగైన విద్యను అందించేందుకు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. సొంత నియోజకవర్గంలో జరిగిన ప్రమాదంలో బాధిత కుటుంబాలకు హోం శాఖ మంత్రి అనిత భరోసా ఇవ్వలేకపోయారన్నారు. ఈ తరహా ప్రమాదాలు జరగకుండా జిల్లా వ్యాప్తంగా పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేయాలని డిమాండ్ చేశారు.
బాణసంచా తయారీ కేంద్రంపై కేసు నమోదు
ఘటనకు సంబంధించి ఇద్దరు బాణసంచా తయారీ కేంద్ర నిర్వాహకులపై కేసు నమోదు చేసినట్టు అనకాపల్లి జిల్లా ఎస్‌పి తుహిన్ సిన్హా తెలిపారు. మందుగుండు సామగ్రిని ఇరపరాడ్డుల సాయంతో గ్రైండింగ్ చేస్తున్న సమయంలో స్పార్క్ రావడంతో ప్రమాదం సంభవించినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని వెల్లడించారు. మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తి చేసి సోమవారం వారి బంధువులకు అప్పగించారు. గాయపడిన ఎనిమిది మందిలో బాణాసంచా తయారీ కేంద్ర మేనేజర్ మడగల జానకిరామ్, జల్లూరి నాగరాజుల పరిస్థితి సోమవారానికీ విషమంగానే ఉంది. ప్రస్తుతం వారు విశాఖ మెడికవర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
గాయపడిన క్షతగాత్రులకు రూ.లక్ష పరిహారం : అనిత
గాయపడిన వారికి ఎక్స్‌గ్రేషియో కింద రూ.లక్ష ఇవ్వనున్నట్టు రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తన వంతుగా రూ. 50 వేలు ఇప్పటికే ప్రకటించిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బాణసంచా తయారీ కేంద్రాలపై అధ్యయనం చేస్తున్నామని మీడియా సమావేశంలో ఆమె చెప్పారు.