ప్రముఖ సముద్ర పరిశోధన శాస్త్రవేత్త మద్దిలేటి రెడ్డి మృతి

ప్రజాశక్తి – కర్నూలు కల్చరల్‌ : ప్రముఖ సముద్ర పరిశోధన శాస్త్రవేత్త, రచయిత డాక్టర్‌ ఎంపి మద్దిలేటిరెడ్డి (95) మరణించారు. వయోభారం సమస్యలతో కర్నూలులోని ఓ ప్రయివేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఆయనకు కుమారుడు మనోహర్‌ ఉన్నారు. భార్య కమల గతంలోనే మరణించారు. కర్నూలులో అంత్యక్రియలు నిర్వహించారు.
కర్నూలు జిల్లా ఉయ్యాలవాడ మండలం సుద్దమల్ల గ్రామంలో మద్దమ్మ, చిన్న మద్దిలేటి దంపతులకు మద్దిలేటిరెడ్డి జన్మించారు. ఆంధ్రా విశ్వవిద్యాలయంలో ఎంఎస్‌సి మెటిరియాలజీ అండ్‌ ఓషనోగ్రఫి పూర్తి చేసి, అదే విశ్వవిద్యాలయం నుంచి పిహెచ్‌డి పొందారు. 1963లో నేషనల్‌ రీసెర్చ్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ కెనడా పోస్టు డాక్టరేట్‌ ఫెలోషిప్‌ రావడంతో కెనడా వెళ్లిపోయారు. మొదటి ప్రాజెక్టుగా వేవ్‌ కండీషన్స్‌, లాంగ్‌ షోర్‌ కరెంట్స్‌, లిట్టోరల్‌ డ్రిఫ్ట్‌ సమర్ధవంతంగా పూర్తి చేశారు. సముద్రశాస్త్రంపై ఆయన రాసిన పుస్తకాలు ప్రపంచంలో దాదాపు 50 దేశాలకు పైగా వివిధ విశ్వవిద్యాలయాల్లో పాఠ్యాంశాలుగా ఉన్నాయి. లండన్‌ లైబ్రరీలో హూ ఈజ్‌ హూలో మద్దిలేటిరెడ్డి పేరు నమోదైంది.1977లో భారత రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డితో ప్రసంశలు అందుకున్నారు. మద్దిలేటిరెడ్డి మృతికి కర్నూలుకు చెందిన కవులు చంద్రశేఖర కల్కూరా, కెంగార మోహన్‌, జంధ్యాల రఘుబాబు, ఇనాయతుల్లా, అజీజ్‌, ఆద్య మెడికల్‌ అధినేత వెంకటేశ్వర రెడ్డి తదితరులు సంతాపం ప్రకటించారు.

➡️