ఉపాధి హామీ చట్టం సమర్థవంతంగా అమలు చేయాలి

  • మహాధర్నాలో వక్తలు 

విజయవాడ: ఉపాధి హామీ చట్టం సమర్థవంతంగా అమలు చేసి వలసలు ఆపాలని వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో విజయవాడలో మహాధర్నా చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా వ్యవసాయ కార్మిక సంఘం (ఎఐఎడబ్ల్యుయు) ప్రధాన కార్యదర్శి వెంకట్‌ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి వెంకటేశ్వర్లు పాల్గొని ప్రసంగించారు. ఈ మహాధర్నాలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు పాల్గొని మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా వెంకట్ మాట్లాడుతూ… ఎన్డీయే – 1లో భాగస్వాములైన వామపక్షాలు చొరవతో ఉపాధి హామీ చట్టం వచ్చిందని తెలిపారు. ఎంతో మంది వ్యవసాయ కార్మికులకు ఉపాధి ఇస్తున్న ఈ పథకాన్ని నిర్వీర్యం చేయాలని మోడీ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని మండిపడ్డారు. దీనిలో భాగంగా ఉపాధి హామీ పనులకు నిధులు ఒక్క రూపాయి కూడా పెంచలేదని తెలిపారు.

రాష్ట్రంలో రెండు కోట్ల మంది పేదలు గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. వీరికి సొంత ఆస్తులు లేక చదువుకున్న వారికి ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు లేక నిత్యం పొట్ట కూటి కోసం ఏ పని దొరికితే ఆ పనికి, డిగ్రీ, పిజి చదువుకున్న పిల్లలు కూడా ఆటో, భవన నిర్మాణ, ఉపాధి పనులకు వెలుతున్నారు. ఆ పనుల్లో కూడా పోటీ పెరిగి చేతి నిండ పని దొరకక సుదూర ప్రాంతాలకు వలసలు పోతున్నారు. ఈ మధ్య కాలంలో అనంతపురం, పల్నాడు, సత్యసాయి, తూర్పుగోదావరి, ఏలూరు జిల్లాల్లో పనికి వెళ్ళి వస్తున్న కూలీలు పెద్దఎత్తున ప్రమాదాల్లో చనిపోతుంటే వారి కుటుంబాలు దిక్కులేని అనాధలుగా మారుతున్నారు. ఇంత దారుణమైన పరిస్థితి పేదలు ఎదుర్కొంటున్న వీరి సమస్యలు పరిష్కరించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా వైఫల్యం చెందుతున్నాయి. పేదలకు అన్నం పెడుతున్న ఉపాధి చట్టానికి బి.జె.పి. ప్రభుత్వం డబ్బులు తగ్గించ్చింది. కూటమి ప్రభుత్వం ఉపాధిని వ్యవసాయానికి అనుసంధానం చేసి పేదల పొట్ట కొడుతుంది. ప్రజా పంపిణీకి కోత విధించారు. వీరి చేతిలో ఉన్న సారెడు భూమి లాక్కుని పెట్టుబడిదారులకు కట్టబెడుతున్నారు. చివరకు చనిపోతే పాతి పెట్టడానికి 6 అడుగుల నేల కూడా లేకుండా చేస్తున్నారు. నేటికి రాష్ట్రంలో 60% మంది వ్యవసాయం పై ఆధాపడి జీవిస్తున్నారు. వీరిలో ఎక్కువ శాతం మంది కౌలు రైతులే. కౌలు చేసేవారంతా వ్యవసాయ కార్మికులు, పేద రైతులు. వీరికి ఎటువంటి చట్టాలు లేవు. ఉన్న అమలు జరగడం లేదు. వ్యవసాయ రంగంలో కూలి పని చేసుకొని జీవిద్దామన్నా పని దొరకడం లేదు. నాట్లు నుంచి నూర్పిడి వరకు యంత్రాలు వచ్చాయి. ఒక ప్రక్కపని లేక పేదలు వందల కి.మీ.ల వలసలు పోతుంటే మరోప్రక్క కూలీలు దొరకడం లేదని సంపన్నులు దుష్ప్రచారం చేస్తున్నారు. దేశంలో లక్షల కోట్లు ప్రజల డబ్బును ప్రభుత్వాలు పెట్టుబడిదారులకు, కార్పొరేట్లకు కట్టబెడుతున్న మాట్లాడని న్యాయమూర్తులు కూడా సంక్షేమ పథకాలు, సబ్సిడీలు వల్ల పేదలు సోమరిపోతులుగా మారుతున్నారని, కూలీలు దొరకడం లేదని నిందలు వేస్తున్నారు. కాబట్టి మన హక్కుల సాధన కోసం పేదలంతా ఐక్యంగా పోరాడవల్సిన అవసరం ఏర్పడింది. కాబట్టి మన డిమాండ్ల సాధన కోసం పోరాడాలని వక్తలు పేర్కొన్నారు.

 డిమాండ్లు : 

  • 100 రోజులు ఉపాధి పని పూర్తి చేసుకున్న గ్రామీణ పేదలకు అదనంగా పనిదినాలు, సమ్మర్ అలవెన్స్, పేస్లిప్లు, పెండింగ్ వేతనాలు ఇవ్వాలి.
  •  వలస కార్మికులకు ఉచితంగా రవాణాసౌకర్యం, బియ్యం, గ్యాస్బండ అందించాలి.
  • ప్రమాదాల్లో చనిపోయిన కుటుంబాలకు రూ.25 లక్షల నగదు, రెండెకరాల భూమి ఇవ్వాలి.
  • ప్రతి పేద కుటుంబానికి ఏడాదికి రూ. 12000/-లు నగదు, 3 సెంట్లు స్థలం, ఇంటి నిర్మాణానికి 6 లక్షల నగదుతో పాటు ప్రతి దళిత కాలనీకి 2 ఎకరాల స్మశాన స్థలం కేటాయించాలి.
  •  ఉపాధి మేట్లకు 5 రూపాయలు పారితోషికం ఇవ్వాలి.

 

 

 

 

➡️