- సమైక్యతా శంఖారావ సభలో వక్తలు

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : మతాన్ని పునాదిగా చేసుకుని పాలన సాగించిన ప్రభుత్వాలు పతనం కాక తప్పదని చరిత్ర చెబుతుందని సమైక్యతా శంఖారావం సదస్సులో పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. మతోన్మాద చర్యలకు పాల్పడితే హిట్లర్‌కు పట్టిన గదే ప్రస్తుత పాలకులకు పడుతుందన్నారు. విజయవాడలోని పిబి సిద్ధార్థ కళాశాల ఆడిటోరియంలో సొసైటీ ఫర్ కమ్యూనల్ హర్మొని ఆధ్వర్యంలో సమైక్యతా శంఖారావ సభ ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు అధ్యక్షత వహించారు. తొలుత మహాత్మాగాంధీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జ్యోతిరావు ఫూలే చిత్రపటాలకు వక్తలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న రాజ్యసభ సభ్యులు ఇమ్రాన్ ప్రతాప్ ఘడి మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టినప్పుడు 288 మంది మద్దతు ఇవ్వగా 232 మంది వ్యతిరేకించారన్నారు. వ్యతిరేకించిన వాళ్లు కేవలం ముస్లింలే కాదని, ఇతర అనేక మతాలు వారు ముస్లింలకు అండగా నిలిచారన్నారు. దీన్ని బట్టీ చూస్తే హిందువులు ఈ బిల్లుకు వ్యతిరేకంగా ముస్లింలకు అండగా నిలిచినట్లు తెలిపారు. చంద్రబాబు నాయుడులో గతానికి, ప్రస్తుతానికి చాలా మార్పు కనిపిస్తోందని చెప్పారు. ఇప్పుడు ముస్లింలపై విషం చిమ్ముతున్నారని చెప్పారు. కేంద్రంలో బిజెపి ప్రభుత్వం గద్దె దిగాలన్నా, వక్ఫ్ బిల్లు ఆమోదం పొందకుండా చెయ్యాలన్నా చంద్రబాబు, నితీష్ కుమార్‌లకు అవకాశం ఉందన్నారు. వీరు ముస్లింలకు వ్యతిరేకంగా, బిజెపి ప్రభుత్వానికి మద్దతుగా ఉన్నారని తెలిపారు. వక్ఫ్ బిల్లు నిలుపుదల చేసే వరకూ సమిష్టి పోరాటం చేద్దామన్నారు. బిజెపి తన సోషల్ మీడియా ఛానల్స్‌తో ప్రజల్లో విద్వేషాన్ని రెచ్చగొడుతుందన్నారు. మనకు ఉన్న సోషల్ మీడియా వేదికల్లో మంచిని పెంపొందించాలని పిలుపునిచ్చారు. ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ మాట్లాడుతూ.. దేశంలో అనేక ధర్మాలు, భాషలు, మతాలు, కులాలు, సంప్రదాయాలు ఉన్నాయని, ఈ వైవిధ్యమే భారతదేశ బలమన్నారు. కొందరు దేశంలో ఒకే భాష, ఒకే మతం ఉండాలని చూస్తున్నారని తెలిపారు. హిందూ, ముస్లిం, క్రిస్టియన్‌లను వేరు చేయాలని చూస్తున్నారని చెప్పారు. ప్రతి జిల్లాలో ఒక కమ్యూనల్ హర్మొని సొసైటీ ఏర్పాటు చేయాలని, దీనిలో ప్రతి మతం వారిని సభ్యులుగా చేయాలని కోరారు. గతంలో హిట్లర్ విభజించి పాలించాలని చూసి నాశనం అయ్యాడని, వీరికి కూడా అదేగతి పడుతుందని చెప్పారు.
సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. స్వాతంత్య్ర ఉద్యమంలో ఏ పాత్ర లేని, బ్రిటీష్ వాళ్లకు ఏజెంట్లుగా పనిచేసిన పార్టీ ప్రస్తుతం దేశాన్ని పాలిస్తుందని తెలిపారు. సరైన సమయంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు అభినందనలు తెలిపారు. ఈ శంఖారావం సదస్సు రాష్ట్ర ప్రజలందరినీ మతోన్మాదానికి వ్యతిరేకంగా సమైక్య పరిచి ముందుకు నడిపించే శక్తి, స్ఫూర్తిగా నిలవాలని కోరారు. కేంద్రం అడుగులకు మడుగులొత్తుతూ ఉప ముఖ్యమంత్రి సనాతన ధర్మం అంటూ కొత్త రాగం అందుకున్నారని చెప్పారు. ముఖ్యమంత్రికి, మంత్రులకు తెలియకుండానే దొంగ ఉత్తర్వులు వెలువడుతున్నాయని చెప్పారు. ఆ తరువాత ఉత్తర్వులు వెనక్కి తీసుకుంటున్నారని అన్నారు. పాలకులు రాజ్యాంగానికి కట్టుబడి ఉంటారా లేక రాజ్యాంగానికి వ్యతిరేకంగా మతోన్మాదానికి లొంగిపోయి లౌకిక వాదానికే ముప్పుతెస్తారా అనేది తేల్చుకోవాలన్నారు. టిడిపి, జనసేన, వైసిపి అందరూ లౌకికవాదం, మతసామరస్యానికి మద్దతుగా పోరాటానికి వీధుల్లోకి రావాలన్నారు. అప్పుడే ఆంధ్రప్రదేశ్ ఐక్యత, ప్రజాస్వామ్యం, మతసామరస్యం నిలబడతాయన్నారు. అమెరికా నుంచి భారతీయులను బేడీలు వేసి వెనక్కి పంపితే దేశభక్తి ఏమైందని ప్రశ్నించారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు మాట్లాడుతూ.. దేశంలో పురాతన కాలం నుంచి అనేక కులాలు, మతాల వారు కలిసి మెలిసి ఉండేవారన్నారు. ముస్లింల అభివృద్ధి, రక్షణకు వక్ఫ్ బోర్డు ఏర్పాటు చేశారని, మోడీ ప్రభుత్వం వక్ఫ్ బోర్డును నిర్వీర్యం చేయడం కోసం ప్రయత్నిస్తోందన్నారు. ఆ మసీదు కింద దేవాలయం ఉందని పిటిషన్లు వేసి మతోన్మాదాన్ని రెచ్చగొడుతున్నారని చెప్పారు. ఉత్తర భారతదేశంలో ఇటువంటి సంఘటనలు నిత్యకృత్యమయ్యాయని తెలిపారు. సొసైటీ ఫర్ కమ్యూనల్ హర్మొని జాతీయ ఉపాధ్యక్షులు కె విజయరావు మాట్లాడుతూ.. 1990లో దేశంలోని కొందరు ప్రముఖ వ్యక్తలు ఈ సంస్థను ఏర్పాటు చేశారని చెప్పారు. మత సామరస్యాన్ని పెంపొందించడమే దీని ముఖ్య లక్ష్యమన్నారు. కొందరు తప్పుడు సమాచారాన్ని విస్తృతంగా ప్రచారం చేసి మత సామరస్యాన్ని విచ్ఛిన్నం చేస్తున్నారని చెప్పారు. పిఇడబ్ల్యూ సంస్థ పరిశోధనాత్మక నివేదికలో మత మార్పిడులు అధికంగా లేవని తేలిందన్నారు. ఈ కార్యక్రమంలో యుపి మాజీ మంత్రి మోయిన్ అహ్మద్, మాజీ ఎంపి, సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు సయ్యద్ అజీజ్ పాషా, ఎపిసిసి అధికార ప్రతినిధి తులసి రెడ్డి, సిద్ధార్థ లా కళాశాల ప్రిన్సిపల్ దివాకర్ బాబు తదితరులు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో ‘హే రామ్ టు జై శ్రీరామ్’ పుస్తకాన్ని ఎంపి ఇమ్రాన్ ప్రతాప్ ఘడి ఆవిష్కరించారు. ప్రముఖ జర్నలిస్ట్ ఆనంద్ వర్ధన్, సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్ బాబూరావు, సిపిఎం ఎన్‌టిఆర్ జిల్లా కార్యదర్శి డివి కృష్ణ, కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్, ఐలు నాయకులు సుంకర రాజేంద్రప్రసాద్, కాంగ్రెస్ నాయకులు మస్తాన్ వలీ, ముస్లిం జెఎసి నాయకులు అబ్దుల్ వహీం, మౌలనా సలా ఉద్దీన్, న్యాయవాదులు చలసాని విజరు కుమార్, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు అశోక్, డివైఎఫ్‌ఐ నాయకులు సూర్యారావు, క్రాంతి కుమార్, రైతు సంఘం నాయకులు ప్రభాకర్‌రెడ్డి, సిపిఐ నాయకులు అక్కినేని వనజ, ఐద్వా నేత శ్రీదేవి, మహిళా సమాఖ్య నాయకులు దుర్గాభవాని తదితరులు పాల్గొన్నారు.