ప్రజాశక్తి-ఉక్కునగరం (విశాఖపట్నం) : విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో కాంట్రాక్టు కార్మికుల తొలగింపునకు వ్యతిరేకంగా పోరాట ఉద్యమం చేయాలని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకులు పిలుపునిచ్చారు. విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రయివేటీకరణను వ్యతిరేకిస్తూ పోరాట కమిటీ ఆధ్వర్యాన కూర్మన్నపాలెంలో చేపట్టిన రిలే నిరాహారదీక్షలు బుధవారం నాటికి 1525వ రోజుకు చేరుకున్నాయి. ఈ దీక్షలో యూస్, డిఐటియు, జెఎంఎస్, విఎస్‌ఎంఎస్, విఎస్‌ఇయు, విఎస్‌పిఇయు తదితర యూనియన్ల నుంచి కార్మికులు కూర్చున్నారు. ఈ సందర్భంగా పోరాట కమిటీ నాయకులు పరంధామయ్య, సురేష్ బాబు మాట్లాడుతూ, విశాఖ ఉక్కు కాంట్రాక్టు కార్మికుల తొలగింపు నిర్ణయాన్ని స్టీల్‌ప్లాంట్ యాజమాన్యం వెంటనే విరమించుకోవాలని, లేకుంటే పెద్ద ఎత్తున ఉద్యమాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు సొంత గనులు కేటాయించాలని, ఉత్పత్తి పెంచడానికి తగిన చర్యలు తీసుకోవాలని గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావును కలిసి కోరినట్లు తెలిపారు.
