ఎండైనా, వానైౖనా పోరాటం ఆగదు

– కలెక్టరేట్‌ వద్ద అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు వంటా వార్పు
ప్రజాశక్తి – పార్వతీపురం టౌన్‌ : ఎండైనా, వానైనా తమ డిమాండ్లు నెరవేరేంత వరకూ పోరాటం ఆగదని గురుకులాల అవుట్‌సోర్సింగ్‌ ఉపాధ్యాయులు స్పష్టం చేశారు. శుక్రవారం పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టరేట్‌ ఎదుట ఎడతెరిపి లేని వర్షంలోనూ ‘వంటా -వార్పు’ కార్యక్రమం నిర్వహిస్తూ 31వ రోజు దీక్షను కొనసాగించారు. వీరి దీక్షకు గిరిజన సంక్షేమ సంఘం, ఐద్వా, యుటిఎఫ్‌, ఎస్‌ఎఫ్‌ఐ, సిఐటియు, అఖిల భారత గ్రామీణ వ్యవసాయ, కార్మిక సంఘం నాయకులు పి.రంజిత్‌ కుమార్‌, వి.ఇందిర, కె.భాస్కర్రావు, డేవిడ్‌, కొల్లి సాంబమూర్తి తదితరులు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు, అవుట్‌ సోర్సింగ్‌ ఉపాధ్యాయులు మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం, గిరిజన సంక్షేమ మంత్రి మొండి వైఖరి వీడి తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. న్యాయమైన డిమాండ్లను నెరవేర్చేంత వరకూ పోరాటం ఆపేది లేదని హెచ్చరించారు. డిఎస్‌సి నుంచి గిరిజన గురుకుల ఉపాధ్యాయ పోస్టులు మినహాయించి, వారికి ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం కాలయాపన చేయకుండా తక్షణమే సమస్యలు పరిష్కరించాలని కోరారు. లేదంటే పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో అవుట్‌సోర్సింగ్‌ ఉపాధ్యాయ సంఘం నాయకులు దివాకర్‌, రమేష్‌, వెంకట్‌, తిరుపతి నాయుడు, మురళి తదితరులు పాల్గన్నారు.

➡️