ఉచిత ఇసుక పాలసీని పారదర్శకంగా అమలు చేయాలి

Oct 27,2024 22:16 #Chittoor District, #CPM Mahasabha

– హంద్రీ-నీవా కాలువ పెండింగ్‌ పనులు పూర్తి చేయాలి
– సిపిఎం చిత్తూరు జిల్లా మహాసభ డిమాండ్‌
– జిల్లా కార్యదర్శిగా వాడ గంగరాజు ఎన్నిక
ప్రజాశక్తి-చిత్తూరు అర్బన్‌ : స్కీమ్‌ వర్కర్లపై రాజకీయ వేధింపులు మానుకోవాలి, కనీస వేతనాలు అమలు చేయాలని, పాడి రైతుకు గిట్టుబాటు ధర కల్పించాలని, ఉచిత ఇసుక పాలసీని పారదర్శకంగా అమలు చేయాలని సిపిఎం చిత్తూరు జిల్లా 14వ మహాసభ డిమాండ్‌ చేసింది. చిత్తూరు కట్టమంచి రోడ్డులోని శాంతా రఘురామ్‌ కల్యాణ మండపంలో రెండు రోజులపాటు జరిగిన జిల్లా మహాసభ ఆదివారంతో ముగిసింది. 12 అంశాలపై ప్రవేశపెట్టిన తీర్మానాలను సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. హంద్రీ-నీవా కాలువ పెండింగ్‌ పనులు పూర్తి చేసి సాగునీరు అందించాలని, అడవిపల్లి రిజ్వరాయర్‌ పనులు పూర్తి చేసి చిత్తూరుకు తాగునీరు అందించాలని, జానపద కళాకారులకు కాణిపాకం దేవస్థానంలో కళాప్రదర్శనలకు అవకాశం కల్పించాలని, మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని, పవర్‌లూమ్‌ కార్మికులకు తమిళనాడు తరహాలో 500 యూనిట్ల ఉచిత విద్యుత్‌ ఇవ్వాలని, జిల్లా కేంద్రంలో యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని, భూకబ్జాలను అరికట్టాలని, మహిళలు, చిన్నపిల్లలపై అత్యాచారాలు, దాడులు అరికట్టాలని, దళితులపై దాడులు అరికట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసింది. తొలుత సిపిఎం జెండాను పార్టీ సీనియర్‌ నాయకులు హైదర్‌వలి ఆవిష్కరించారు. అనంతరం అమరవీరులు స్థూపానికి సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు డి.రమాదేవి, రాష్ట్ర నాయకులు దడాల సుబ్బారావు నివాళులర్పించారు. జిల్లా నాయకులు సురేంద్రన్‌, షకీల అధ్యక్షతన సమావేశం కొనసాగింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తోన్న ప్రజావ్యతిరేక విధానాలపై రాజీలేని పోరాటాలకు సద్ధం కావాలని పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు రమాదేవి పిలుపునిచ్చారు. దడాల సుబ్బారావు మాట్లాడుతూ.. కేంద్రంలో మోడీ ప్రభుత్వం, రాష్ట్రంలో టిడిపి కూటమి ప్రభుత్వం పేదల సమస్యలు పట్టించుకోవడం లేదన్నారు. నిత్యావసర వస్తువుల ధరల అదుపు చేయాలని, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. అనంతరం గత మూడు సంవత్సరాల కాలంలో జిల్లాలో నిర్వహించిన ప్రజాసమస్యలపై పోరాటాలను సమీక్షించి రానున్న మూడేళ్లలో ప్రజాసమస్యలపై భవిష్యత్తు పోరాటలకు రూపకల్పన చేశారు. సిపిఎం చిత్తూరు జిల్లా నూతన కార్యదర్శిగా వాడ గంగరాజు రెండోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జిల్లా కమిటీ సభ్యులుగా సురేంద్రన్‌, ఓబుల్‌రాజు, గిరిధర్‌ గుప్తా, భువనేశ్వరి, షకీల ఎన్నుకోబడ్డారు.

➡️