- వైసిపి ఎమ్మెల్సీ వరుదు కల్యాణి
ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : రాష్ట్రంలో రైతాంగాన్ని ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని వైసిపి ఎమ్మెల్సీ వరుదు కల్యాణి అన్నారు. మంగళవారం అసెంబ్లీ మీడియా పాయింట్లో ఆమె మాట్లాడుతూ పెట్టుబడిసాయం లేదని, పండించిన పంటకు గిట్టుబాటుధర లభించక రైతులు కుదేలవుతున్నారని చెప్పారు. అయినా, ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని అన్నారు. ‘అన్నదాతా సుఖీభవ’ పేరుతో పెట్టుబడిసాయంగా ప్రతి రైతుకు ఏటా రూ.20 వేలు ఇస్తామని చెప్పారని, దానిలో కేంద్రం సాయం ప్రస్తావించలేదని, ఇప్పుడు కేంద్ర సాయాన్ని కలిపి చెబుతున్నారని తెలిపారు. రాష్ట్రంలో పంట విస్తీర్ణం 85 లక్షల ఎకరాల నుండి 70 లక్షల ఎకరాలకు తగ్గిపోయిందని పేర్కొన్నారు. ఎరువులతో రైతులు దగా పడుతున్నారని, నాణ్యమైన విత్తనాలూ అందడం లేదని వివరించారు. జగన్ సిఎంగా ఉన్న సమయంలో మిర్చికి క్వింటాకు రూ.21 వేలు నుండి రూ.27 వేలు ధర ఉందని, ఇప్పుడు క్వింటా తొమ్మిది వేలకు పడిపోయిందని అన్నారు. పత్తిధర ఐదువేలు దాటడం లేదని పేర్కొన్నారు.