- మంత్రి కొండపల్లి శ్రీనివాస్
ప్రజాశక్తి – ఎంవిపి కాలనీ (విశాఖపట్నం) : ఎంఎస్‌ఎంఇ రంగం అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర ఎంఎస్‌ఎంఇ, ఎస్‌ఇఆర్‌పి ఎన్‌ఆర్‌ఐ సాధికారత, సంబంధాల మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. సూక్ష్మ, చిన్న మధ్య తరహా సంస్థల (ఎంఎస్‌ఎంఇ) ఎదుగుదల, ఆవిష్కరణల ప్రోత్సాహం కోసం ‘ఎగుమతికి ఎంఎస్‌ఎంఇలకు సాధికారత -అభివృద్ధి, ఆవిష్కరణల దిశగా” వర్క్‌షాప్‌ను విశాఖపట్నం నోవాటెల్ హోటల్‌లో బుధవారం నిర్వహించారు. ముఖ్య అతిథిగా మంత్రి కొండపల్లి హాజరై మాట్లాడుతూ ఎంఎస్‌ఎంఇ రంగం అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు. ఎంఎస్‌ఎంఇలు రాష్ట్రంలో ఉపాధి పెంపుదల, ఆర్థిక వృద్ధికి మూలస్తంభాలు అని అభివర్ణించారు. స్వర్ణాంధ్ర 2047 డాక్యుమెంట్‌లో ఎంఎస్‌ఎంఇ రంగాన్ని మెరుగుపరిచేందుకు పది కీలక సూత్రాలను రూపొందించినట్లు తెలిపారు.
2001లో రాష్ట్రంలో సింగిల్ విండో యాక్ట్ ప్రవేశపెట్టి పారిశ్రామిక అనుమతుల సరళీకరణకు పునాది వేశామని, అప్పటి నుంచి దీన్ని పటిష్టంగా కొనసాగిస్తున్నామని వివరించారు. రాష్ట్రం ఇజి అఫ్ డూయింగ్ బిజినెస్‌లో స్థిరంగా నంబర్ వన్ స్థానాన్ని కలిగి ఉందని, ఇది పారిశ్రామిక రంగానికి అనుకూల వాతావరణాన్ని సూచిస్తుందని పేర్కొన్నారు. 2023-24లో రాష్ట్రం నుంచి రూ.1,63,000 కోట్ల ఎగుమతులు జరిగాయని, ఉత్పత్తి ప్రామాణీకరణ ద్వారా ఎగుమతులను మరింతగా పెంచేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ వికసిత్ భారత్ 2047 డాక్యుమెంట్ రూపకల్పనలో ఆంధ్రప్రదేశ్ కీలకపాత్ర పోషిస్తోందని, ముఖ్యమంత్రి చంద్రబాబు స్వర్ణాంధ్ర 2047 ద్వారా గ్రామ స్థాయి నుంచి పారిశ్రామిక ప్రగతికి అవసరమైన వ్యూహాలను రూపొందిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో నీతి ఆయోగ్ సీనియర్ అడ్వైజర్ సంజీత్ సింగ్, విశాఖపట్నం జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంధిరప్రసాద్, ఎపి ఎంఎస్‌ఎంఇ డిసి చైర్మన్ శివశంకరరావు తదితరులు పాల్గొన్నారు.