ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : ఏదైనా కేసులో నిందితుడికి తనకు న్యాయ సహాయం అందించాలని కోరే హక్కు ఉంటుందని హైకోర్టు స్పష్టం చేసింది. ఒక కేసులో నిందితుడిని పోలీసులు పిటి వారెంట్ మీద మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచినప్పుడు, ఆ నిందితుడు పోలీసు లేదా జ్యుడీషియల్ కస్టడీని వ్యతిరేకిస్తూ తనకు న్యాయ సాయం అందించాలని సదరు మెజిస్ట్రేట్‌ను కోరే హక్కు ఉంటుందని వెల్లడించింది. సోషల్ మీడియా కార్యకర్త ఇంటూరి రవికిరణ్‌కు హైకోర్టు అలాంటి వెసులుబాటును కల్పించింది. పోలీసులు పెట్టిన కేసుల వివరాలు తనకు చెప్పడం లేదంటూ రవి కిరణ్ న్యాయ సహాయం కోరడాన్ని సమర్థించింది. రవికిరణ్‌పై రాష్ట్రంలోని వేర్వేరు పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసుల వివరాలన్నిటినీ తమ ముందుంచాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. తన భర్త ఇంటూరి రవికిరణ్‌పై ఉన్న కేసులకు సంబంధించిన వివరాలను గానీ, పిటి వారెంట్ల గురించి గానీ పోలీసులు తమకు ఎలాంటి సమాచారం ఇవ్వడం లేదంటూ ఇంటూరి సుజన దాఖలు చేసిన పిటిషన్ విచారణ సందర్భంగా హైకోర్టు పైవిధంగా ఉత్తర్వులు జారీ చేసింది.