హెల్మెట్‌ ధరించక గాలిలో ప్రాణాలు.. హైకోర్టు ఆందోళన

ప్రజాశక్తి-అమరావతి : హెల్మెట్‌ పెట్టుకోకపోవడం వల్ల ప్రమాదాలు పెరుగుతున్నాయని హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. గత జూన్‌ నుంచి సెప్టెంబర్‌ మధ్యకాలంలో హెల్మెట్‌ ధరించకపోవడం వల్ల రాష్ట్రంలో 667 మంది చనిపోవడంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. హెల్మెట్‌ వినియోగించేలా చేయడంలో పోలీసులు కఠినంగా వ్యవహరించకపోవడం వల్లే అంతమంది చనిపోయారని వ్యాఖ్యానించింది. పోలీసుల అలసత్వం వల్లే ఈ పరిస్థితి నెలకొందని తప్పుపట్టింది. హెల్మెట్‌ ధరించకపోవడం వల్ల విధించిన చలాన్లు కట్టని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంది. ఇలాంటి వారి ఇళ్ల విద్యుత్‌ సరఫరా నిలిపివేయడమో, నీటి సరఫరా ఆపేయడమో వంటి చర్యలు తీసుకోవాలని అభిప్రాయపడింది. లేదంటే వారి వాహనాన్ని జప్తునకు వీలుందేమో పరిశీలన చేయాలంది. కేంద్ర మోటారు వాహన సవరణ చట్ట నిబంధనలను అమలు చేయకపోవడం వల్ల రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్నాయని, మరణాల సంఖ్య కూడా ఎక్కువగా ఉందంటూ న్యాయవాది తాండవ యోగేష్‌ పిల్‌ దాఖలు చేశారు. దీనిని చీఫ్‌ జస్టిస్‌ ధీరజ్‌ సింగ్‌ ఠాకూర్‌, జస్టిస్‌ చీమలపాటి రవితో కూడిన డివిజన్‌ బెంచ్‌ బుధవారం విచారణ జరిపింది. రాష్ట్ర వ్యాప్తంగా 8,770 మంది ట్రాఫిక్‌ పోలీసులు ఉండాల్సి వుంటే.. 1994 మందే ఉన్నారని, ఖాళీలను ఎప్పుడు భర్తీ చేస్తారని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. రాష్ట్రం నుంచి తెలంగాణ వెళ్లే వారు తెలంగాణ సరిహద్దులోకి చేరగానే సీటు బెల్ట్‌, హెల్మెట్‌ పెట్టుకుంటున్నారని చెప్పింది. మోటారు వాహన చట్ట నిబంధనల అమలు తీరు విషయంలో పోలీసులు, ఆర్‌టిఎ అధికారుల వైఖరిపై అసంతృప్తి వ్యక్తం చేసింది. తదుపరి విచారణకు ట్రాఫిక్‌ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ (ఐజి) స్వయంగా విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. విచారణను ఈ నెల 18కు వాయిదా వేసింది.

➡️