ఆ 2 సినిమాల టిక్కెట్ల అధిక రేట్లు పది రోజులకే..

  • రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

ప్రజాశక్తి-అమరావతి : త్వరలో విడుదల కానున్న డాకు మహారాజ్‌, గేమ్‌ ఛేంజర్‌ సినిమా టిక్కెట్లను మొదటి 14 రోజులపాటు అధిక ధరలకు అమ్ముకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడాన్ని తప్పుపడుతూ దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు స్పందించింది. అధిక ధరలకు టిక్కెట్లను అమ్ముకునేందుకు ఆ చిత్ర నిర్మాతలకు అనుమతినిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అధిక ధరలను మొదటి 10 రోజులకే పరిమితం చేయాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు చీఫ్‌ జస్టిస్‌ ధీరజ్‌ సింగ్‌ ఠాకూర్‌, జస్టిస్‌ చీమలపాటి రవితో కూడిన ధర్మాసనం బుధవారం ఆదేశించింది. బాలకృష్ణ నటించిన డాకు మహారాజ్‌, రామ్‌చరణ్‌ నటించిన గేమ్‌ ఛేంజర్‌ సినిమాల టిక్కెట్లను మొదటి 14 రోజుల పాటు అధిక ధరలకు అమ్ముకునేందుకు ప్రభుత్వం అనుమతినివ్వడాన్ని గుంటూరుకు చెందిన అరిగెల శ్రీనివాసులు హైకోర్టులో సవాల్‌ చేస్తూ పిల్‌ దాఖలు చేశారు. న్యాయవాది గుండాల శివప్రసాద్‌ రెడ్డి వాదిస్తూ, రూ.100 కోట్లకు పైగా బడ్జెట్‌ ఉన్న సినిమాలకు మొదటి 10 రోజులకు అధిక ధరలకు టిక్కెట్లు అమ్ముకునేందుకు అనుమతినిస్తూ ప్రభుత్వం గతంలో జిఓ 13 జారీ చేసిందన్నారు. ఇప్పుడు అందుకు విరుద్ధంగా 14 రోజులపాటు అధిక ధరలకు టిక్కెట్లు అమ్ముకునేందుకు ప్రభుత్వం మెమో ఇచ్చిందన్నారు.

➡️