కమ్యూనిస్టుల చరిత్ర అంటే ప్రజల చరిత్రే

 ‘నవ సమాజం కోసం’ పుస్తకావిష్కరణ సభలో వి శ్రీనివాసరావు
ప్రజాశక్తి- కాకినాడ ప్రతినిధి : కమ్యూనిస్టుల చరిత్ర అంటే అది ప్రజల చరిత్ర అని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు అన్నారు. సిపిఎం కాకినాడ జిల్లా కమిటీ సభ్యులు దువ్వా శేషబాబ్జి రచించిన ‘నవ సమాజం కోసం’ పుస్తకావిష్కరణ కార్యక్రమం కాకినాడలోని అన్నదాన సమాజంలో ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి కరణం ప్రసాదరావు అధ్యక్షతన నిర్వహించిన సభలో వి.శ్రీనివాసరావు ముఖ్యవక్తగా మాట్లాడారు. ప్రజా పోరాటాల చరిత్రే కమ్యూనిస్టు ఉద్యమ చరిత్ర అని వివరించారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో స్వాతంత్య్రోద్యమ కాలంలోనే కమ్యూనిస్టు బీజాలు పడ్డాయన్నారు. నాడు కాకినాడ అన్నదాన సమాజంలో రహస్యంగా పార్టీ ఏర్పడిందని తెలిపారు 1934-1964 మధ్య ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కమ్యూనిస్టు ఉద్యమ ఘట్టాలను వివరిస్తూ శేషబాబ్జి ‘నవ సమాజం కోసం’ పేరుతో పుస్తకాన్ని తీసుకురావడం అభినందనీయమన్నారు. తెలంగాణ సాయుధ పోరాటానికి మద్దతుగా ఈ జిల్లాలో పోరాటం జరిగిందని గుర్తు చేశారు. కమ్యూనిజం అంతరించిపోయిందని అమెరికాలో తీవ్ర ప్రచారం జరిగిందన్నారు. నేడు కమ్యూనిస్టు పేరు వింటేనే ట్రంప్‌ ఉలిక్కి పడుతున్నారని తెలిపారు. ప్రపంచంలో ఆర్థిక సంక్షోభం తీవ్రతరం అవుతున్న నేపథ్యంలో ప్రజలు ఎర్రజెండా వైపు చూస్తారన్నారు. బూర్జువా, భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా ప్రజలను ఐక్యం చేయడం కమ్యూనిస్టుల కర్తవ్యం కావాలని సూచించారు. ఎంఎల్‌ఎలు, ఎంపిలు లేనంత మాత్రాన కమ్యూనిస్టుల చరిత్ర మరుగున పడిపోయేది కాదన్నారు. యువకులు ఈ పుస్తకాన్ని అధ్యయనం చేయాలని కోరారు. సమాజంలో మార్పు కోసం ఏమి చేయాలో మార్గనిర్దేశం చేయడానికి ఇది తోడ్పడుతుందని తెలిపారు. వామపక్షాల మద్దతుతో ఉపాధి హామీ వంటి అనేక చట్టాలు వచ్చాయన్నారు. కానీ, వాటిని నిర్వీర్యం చేసేందుకు క్రాప్‌ హాలిడేలాంటి కుట్రలు జరుగుతున్నాయని వివరించారు. కమ్యూనిస్టుల పోరాటాలు, త్యాగాలు వఅథా కాలేదన్నారు. వివిధ ప్రభుత్వ రంగ కార్యాలయాల్లో, సంస్థల్లో కార్మిక సంఘాలను నిర్మించింది కమ్యూనిస్టులేనని, కార్మికులను ఏకతాటిపైకి తీసుకొచ్చి పెట్టుబడిదారుల దోపిడీని ప్రశ్నించింది కమ్యూనిస్టులేనని గుర్తు చేశారు. ప్రజా ఉద్యమాలను ఏకం చేయడమే ముందున్న కర్తవ్యమన్నారు. తద్వారా కమ్యూనిస్టు పార్టీ బలమైన ప్రత్యామ్నాయ శక్తిగా ముందుకు వస్తుందని పేర్కొన్నారు. బూర్జువా, భూస్వామ్య పార్టీల కుట్రలు, కుతంత్రాలు ఎదుర్కొని ప్రజలను ఐక్యంగా నిలబెట్టాల్సిన అవసరం ఉందన్నారు. దేశంలో చరిత్ర వక్రీకరణ జరుగుతోందని, సామాన్యుల చరిత్రను పక్కనపెట్టి దాని స్థానంలో మతోన్మాద చరిత్రను ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. సామాజికాభివృద్ధి క్రమంలో ఉత్పత్తిని పెంచడానికి శ్రమ కీలకమైందనే విషయాన్ని బయటకు రానీయకుండా పెట్టుబడిదారులు అన్ని రకాల కుట్రలూ చేస్తున్నారన్నారు. శ్రమ కాకుండా పెట్టుబడే కీలకమంటూ వారు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో పుస్తక రచయిత దువ్వా శేషబాబ్జి, సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎవి.నాగేశ్వరరావు, జెవివి సీనియర్‌ నాయకులు డాక్టర చెలికాని స్టాలిన్‌, ఐడియల్‌ విద్యా సంస్థల అధినేత డాక్టర్‌ పి.చిరంజీవినీకుమారి, సిపిఐ తూర్పుగోదావరి జిల్లా కార్యదర్శి టి.మధు, సిపిఎం తూర్పుగోదావరి జిల్లా కార్యదర్శి టి.అరుణ్‌, లిబరేషన్‌ నాయకులు గొడుగు సత్యనారాయణ, చిన్నబిల్లి నాగేశ్వరరావు, కమ్యూనిస్టు ఉద్యమంలో అమరుల కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

➡️