ఆరోగ్యశ్రీ అమలుపై స్పష్టతివ్వాలి

Aug 1,2024 00:11 #Arogya Shri

మాజీ మంత్రి విడదల రజిని డిమాండ్‌
ప్రజాశక్తి-గుంటూరు జిల్లాప్రతినిధి : రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ పథకం అమలుపై టిడిపి ప్రభుత్వ వైఖరిని వెల్లడించాలని మాజీ మంత్రి విడదల రజిని డిమాండ్‌ చేశారు. గుంటూరులోని తన నివాసంలో ఆమె బుధవారం మీడియాతో మాట్లాడారు. వైసిపి హయాంలో ఏటా రూ.3 వేల కోట్లకుపైగా నిధులను ఖర్చు చేసి రాష్ట్రంలో పేద, మధ్య తరగతి ప్రజలకు వైద్య సేవలందించేందుకు ఆరోగ్యశ్రీ పథకాన్ని అద్భుతంగా అమలు చేశామన్నారు. ఈ పథకాన్ని నిర్వీర్యం చేసి ఆయుష్మాన్‌ భారత్‌ పథకానికే ఈ సేవలను పరిమితం చేయాలని రాష్ట్ర మంత్రులు చేస్తున్న ప్రకటనలు ప్రజల్లో గందరగోళం సృష్టిస్తున్నాయని తెలిపారు. ఆయుష్మాన్‌ భారత్‌ కేవలం 60 లక్షల మందికే పరిమితమని, ఆరోగ్యశ్రీ కోటీ 42 లక్షల కుటుంబాలకు ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ఆయుష్మాన్‌ భారత్‌ ద్వారా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి కేటాయించేది గరిష్టంగా రూ.300 కోట్లు కాగా.. ఆరోగ్యశ్రీ ద్వారా రూ.3 వేల కోట్లు ఖర్చు చేశామని తెలిపారు. చికిత్స తర్వాత కూడా మంచాన ఉండి విశ్రాంతి తీసుకునే వారికి ఆరోగ్య ఆసరా పథకం కింద మరో రూ.300 కోట్లు ఖర్చు చేశామన్నారు. వైసిపి హయాంలో రాష్ట్రంలో 17 మెడికల్‌ కళాశాలలు ఏర్పాటుకు కేంద్రం నుంచి అనుమతి పొందామని, గతేడాదికే ఐదు కళాశాలలు ప్రారంభించారని చెప్పారు. ఈ ఏడాది మరో ఐదు కళాశాలలకు అడ్మిషన్లు జరగాల్సి ఉండగా… ఇప్పటి వరకు కూటమి ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శించా రు. నిర్మాణంలో ఉన్న కళాశాలలను ప్రజలకు, విద్యార్థులకు అందుబాటులో తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని వెల్లడించాలని డిమాండ్‌ చేశారు. వైద్య రంగానికి అధిక ప్రాధాన్యమిచ్చి ఎప్పటికప్పుడు ఖాళీలు భర్తీ చేసి 45 వేల మందిని నియమించామని, నాడు-నేడు కింద ఆస్పత్రుల అభివృద్ధికి రూ.17 వేల కోట్లు ఖర్చు చేశామని రజిని చెప్పారు.

➡️