సంఘ సంస్కరణ ఉద్యమ ప్రాధాన్యత గుర్తించాలి

May 27,2024 16:21 #AP History, #Kakinada

ఆర్.వి.ఎన్. స్టడీ సర్కిల్ సదస్సులో వక్తలు

ప్రజాశక్తి-కాకినాడ : సమాజ మార్పు కోరుకునేవారు ముందుగా సంఘ సంస్కరణ ఉద్యమ ప్రాధాన్యత గుర్తించాలని ప్రజా సాంస్కృతికోద్యమ రాష్ట్ర నాయకులు మంతెన సీతారాం పేర్కొన్నారు. స్థానిక కచేరిపేట యుటిఎఫ్ హోంలో రఘుపతి వెంకటరత్నం నాయుడు (ఆర్.వి.ఎన్.) స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో తెలుగునేలపై సంఘ సంస్కరణోద్యమాలు అనే అంశంపై సదస్సు నిర్వహించారు. ముందుగా రఘుపతి వెంకటరత్నం నాయుడు చిత్ర పటానికి మంతెన సీతారాం, డా. చెలికాని స్టాలిన్ లు పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం యుటిఎఫ్ పూర్వ రాష్ట్ర కార్యదర్శి జి. ప్రభాకర వర్మ అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో సీతారాం ముఖ్యవక్తగా ప్రసంగించారు. బ్రిటిష్ కాలంలో కొంతమందికైనా చదువుకునే అవకాశం రావడంతో భారత సమాజంలో ఉన్న సతీసహగమనం వంటి అమానుష దురాచారాలపై రాజా రామ్మోహన్ రాయ్ వంటి మహనీయులు సంఘ సంస్కరణ ఉద్యమాలు చేసారని తెలిపారు. తెలుగు నాట కూడా వేమన, కందుకూరి వీరేశలింగం, గురజాడ అప్పారావు, రఘుపతి వెంకటరత్నం నాయుడు, బ్రహ్మనాయుడు వంటి సంఘ సంస్కర్తలు చేసిన కృషి ఎనలేనిదని కొనియాడారు. రాష్ట్రంలో రాత్రి బడులు, స్త్రీ చైతన్యం, ప్రజా కళలు, వివక్షత పై పోరాటం వంటి విషయాల్లో వామపక్ష ఉద్యమం తగిన పాత్ర పోషించిందన్నారు. శాస్త్ర సాంకేతిక రంగాల్లో దేశం ముందుకు దూసుకుపోతున్నప్పటికీ ఇంకా మన సంఘంలో సంస్కరించుకోవాల్సినవి చాలా ఉన్నాయన్నారు. ఇటీవల సనాతన ధర్మం పేరుతో సాగిన చర్చ చూసామన్నారు. అమానుషమైన కుల వివక్షత, స్ర్తీల పట్ల చిన్నచూపు కొనసాగడం ఏవిధమైన ధర్మమని ప్రశ్నించారు. మతం మాటున మూఢనమ్మకాలు సాగడాన్ని సహించరాదన్నారు. రాజ్యాంగం ప్రకారం శాస్త్రీయమైన ఆలోచన, ఆచరణ పెంపొందించుకోవాలన్నారు. అతిధి గా హాజరైన జన విజ్ఞాన వేదిక రాష్ట్ర గౌరవాధ్యక్షులు డా. చెలికాని స్టాలిన్ మాట్లాడుతూ అన్ని స్థాయిల్లోనూ ప్రశ్నించే తత్వాన్ని అలవాటు చేయాలన్నారు. రాజకీయ, ఆర్ధిక విషయాలతో పాటు సామాజిక, సాంస్కృతిక విషయాలలో కూడా ప్రజాస్వామ్య భావజాలం పెరగాలన్నారు.
యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి టి. అన్నారాం, పలు ప్రజా సంఘాల నాయకులు పాల్లొన్న ఈ సదస్సుకి ఆర్.వి.ఎన్. స్టడీ సర్కిల్ కన్వీనర్ ఎన్. గోవిందరాజులు ఆహ్వానం పలికారు. ప్రతీ నెలా జరిగే సదస్సు లను నగర ప్రజలు జయప్రదం చేయాలని కోరారు.

➡️