విజయనగరం నియోజకవర్గంలో పెరిగిన ఓట్లు – నాయకుల్లో లెక్కల పాట్లు..!

May 14,2024 11:35 #increased, #Vizianagaram, #votes

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : విజయనగరం నియోజకవర్గంలో 2024 సాధారణ ఎన్నికల్లో ఓటర్లు పోటీ చేసిన నాయకులకు దడ పుట్టించారు. గత ఎన్నికలతో చూసుకుంటే ఈ 2024 ఎన్నికల్లో ఎక్కువమంది ఓట్లను వినియోగించుకున్నారు. గత ఎన్నికల్లో 2014 లో 71.28 శాతం మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. 2019 లో 70.86 శాతం ఓట్లు నమోదు కావడం జరిగింది. ఈ ఎన్నికల్లో శాతం పరంగా పెరుగుదల కనిపించినప్పటికీ ఓట్లు పెరిగాయి. గత 2019 ఎన్నికల్లో విజయనగరం నియోజకవర్గంలో 1,65,111 ఓట్లు నమోదు కావడం జరిగింది. 1600 వరకు పోస్టల్‌ బ్యాలెట్లు నమోదు కావడం జరిగింది.

సోమవారం జరిగిన 2024 ఎన్నికల్లో 1,83,232 ఓట్లు నమోదు కావడం జరిగింది. వీటితో పాటు పోస్టల్‌ బ్యాలెట్లు ఓట్లు 4211 ఓట్లు నియోజకవర్గంలో ఓట్లు నమోదు అయ్యాయి. అంటే గత ఎన్నికలతో చూసుకుంటే 18121 ఓట్లు, పోస్టల్‌ బ్యాలెట్లు 4211 ఓట్లు కలుపుకుంటే 22333 ఓట్లు అధికంగా నమోదు కావడం జరిగింది. మొత్తం ఓట్లు 2,57,205 కు గానూ 1,83232 ఓట్లు నమోదు కావడం జరిగింది. ఉదయం 11 గంటల వరకు పోలింగ్‌ కేంద్రాలు వద్ద పెద్ద సంఖ్యలో వచ్చి ఓట్లు వినియోగించుకున్నారు. అదే విధంగా సాయంత్రం కూడా పెద్ద సంఖ్యలో ఓటర్లు రావడంతో రాత్రి 11 గంటలు వరకు నాలుగు పోలింగ్‌ కేంద్రాల లో ఓటింగ్‌ జరిగింది. సాయంత్రం ఓటింగ్‌ లో పాల్గొన్నవారు బయట ప్రాంతాల నుంచి వచ్చిన వారు అధికంగా ఉండటం విశేషం.

పెరిగిన ఓట్లు ఎవరికి నష్టం,ఎవరికి లాభం… లెక్కలు వేసుకునే పనిలో ప్రధాన పార్టీలు నాయకులు..
గత ఎన్నిక కంటే 20 వేలకు పైగా ఓట్లు విజయనగరం నియోజకవర్గంలో ఓట్లు నమోదు కావడంతో ప్రధాన పార్టీల అభ్యర్థుల్లో దడ పుట్టిస్తున్నాయి. దీంతో ప్రధాన పార్టీలకు చెందిన నాయకులు 260 పోలింగ్‌ జరిగిన విధానం, ఓటర్లను మెప్పించుకున్న దానిపై ఆరా తీస్తూ లెక్కలు వేసుకునే పనిలో మంగళవారం నిమగ్నమయ్యారు. పోలింగ్‌ బూత్‌ల వారీగా లెక్కలు ప్రారంభించారు. అయితే పెరిగిన ఓట్లు ప్రభావం… ఎవరి మీద పడుతుందనే భయం ఇప్పుడు నాయకుల్లో నెలకొంది. అధికార పార్టీ నాయకులు వారి ఓట్లు వఅధా కాకుండా వేయించుకోవడం ఫలితంగా ఓట్లు పెరిగాయని భావిస్తున్నారు. ప్రతిపక్ష తెలుగుదేశం నేతలు ప్రభుత్వ వ్యతిరేకత ఓట్లు పెరగడానికి కారణం కాబట్టి కూటమి అభ్యర్ధి విజయం ఖాయం అన్న చర్చ వారిలో సాగుతుంది. అధిక సంఖ్యలో యువత, మహిళలు, వృద్దులు సైతం ఓట్లు వినియోగించుకోవడం జరిగింది. అయితే అధికార వైసిపి నేతలు మహిళలు, వృద్దులు ఓట్లు అధికంగా తమకు పడ్డాయని చెబుతున్నారు. ప్రతిపక్ష కూటమి పార్టీలు నేతలు ప్రభుత్వ వ్యతిరేకత ఉండటం కారణంగా ఓట్లు పెరుగుదలకు దోహదం చేశాయని, అందులో ఉద్యోగులు, యువత, వలస ఓటర్ల, ఇతర ప్రాంతాల నుంచి వచ్చినవారు ఓట్లు వేశారనే నమ్మకంతో కూటమి పార్టీలు నాయకులు చెబుతున్నారు. వాస్తవానికి మహిళలు అత్యధికంగా 94,196 మంది ఓట్లు వేయడం జరిగింది.పురుషులు 89029 మంది ఓట్లు వేయడం జరిగింది.అంటే పురుషులు కంటే మహిళలు 4200 పైగా ఓట్లు అధికంగా నమోదు కావడం జరిగింది. దీంతో ప్రధాన పార్టీలు అభ్యర్దులు ఎవరి అంచనాలు వారు వేసుకునే పనిలోపడ్డారు. 260 పోలింగ్‌ కేంద్రాలలో జరిగిన ఓటింగ్‌ పై ప్రత్యేక లెక్కలు వేసుకునే పనిలో ఉన్నారు. అయితే ఓట్లు పెరగడంతో ఎవరి వాదనలు ఎలా ఉన్నా అధికార పార్టీ కి నష్టం కలిగించే అవకాశం ఉన్నట్లు నగర వాసులు చర్చించుకుంటున్నారు. మరోవైపు పోల్‌ మేనేజ్‌మెంట్‌ చేయడం కారణంగా ఓట్లు పెరిగాయని అధికార పార్టీ నాయకులు వెల్లడిస్తున్నారు. ఎవరి అంచనాలు వారికే ఉన్నప్పటికీ జూన్‌ 4 తేదిన ఎవరి అంచనాలు సరైంది అన్నది తేలనుంది..!

➡️