పులివర్తి నానిపై హత్యాయత్నం కేసుపై దర్యాప్తు ముమ్మరం

May 15,2024 12:30 #investigation, #Pulivarthi Nani

తిరుపతి: పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో చంద్రగిరి టిడిపి అభ్యర్థి పులివర్తి నానిపై జరిగిన హత్యాయత్నం కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఆరుగురు అనుమానితులను రామచంద్రాపురం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని తిరుపతికి తరలించి రహస్యంగా విచారిస్తున్నారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న జడ్పీటీసీ సభ్యురాలి భర్త భానుప్రకాష్‌రెడ్డి, నడవలూరు సర్పంచ్‌ గణపతిరెడ్డి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
నానిపై దాడిలో సుమారు 15 మంది పాల్గన్నట్లు సీసీ కెమెరాల ఆధారంగా పోలీసులు గుర్తించారు. నిందితులను గంటలో అదుపులోకి తీసుకుంటామని జిల్లా ఎస్పీ మంగళవారం ప్రకటించారు. ఇప్పటి వరకు వారిని అదుపులోకి తీసుకోకపోవడంపై టిడిపి నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు పోలీసుల వైఖరిని నిరసిస్తూ పులివర్తి నాని భార్య సుధ ఆందోళనకు దిగారు. 24 గంటలు గడుస్తున్నా నిందితులను పట్టుకోలేదంటూ తిరుచానూరు పీఎస్‌ వద్ద ఆమె నిరసన చేపట్టారు.

➡️