ఫైల్స్‌ దగ్ధం కేసు దర్యాప్తు వేగవంతం

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్ర పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు (పిసిబి) ఫైల్స్‌ దహనం కేసులో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. బుధవారం విజయవాడలోని పిసిబి ప్రధాన కార్యాలయంలో పోలీసులు విచారణను చేపట్టారు. కార్యాలయం నుంచి దస్త్రాలు బయటకు వెళ్లడంపై అన్ని విభాగాల్లోని అధికారులను పోలీసులు ఆరా తీశారు. ఫైల్స్‌, హార్డ్‌ డిస్క్‌లు బయటకు వెళ్లటంలో అధికారుల పాత్ర, కాల్చిన ఫైల్స్‌లోని అంశాలు, వాటి ప్రాధాన్యతపై దర్యాప్తు చేపట్టారు. ఫైల్స్‌లోని సమాచారంపై సిబ్బంది నుండి వాంగ్మూలాలను నమోదు చేశారు. ఇటీవల కృష్ణా కరకట్టపై దస్త్రాల దహనం ఘటనకు సంబంధించి పెనమలూరు పోలీసులు భారతీయ నాగరిక్‌ సురక్షా సంహిత (బిఎన్‌ఎస్‌ఎస్‌)లోని సెక్షన్‌ 106 కింద కేసు నమోదు చేశారు. సమీర్‌ శర్మ వద్ద ఒఎస్‌డిగా పనిచేసిన రామారావు, డ్రైవర్‌ నాగరాజు, అటెండర్‌ రూపేంద్రను స్టేషన్‌కు పిలిపించి సుదీర్ఘంగా విచారణ జరిపారు. దస్త్రాల్ని తీసుకొచ్చిన వాహనాన్ని ఇప్పటికే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

➡️