జెఎల్‌పిఎం సమస్య పరిష్కారానికి చర్యలు

  • అసెంబ్లీలో రెవెన్యూశాఖ మంత్రి అనగాని

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : జాయింట్‌ ఎల్‌పిఎంలలో ఏర్పడిన సమస్యల వల్ల భూముల మ్యుటేషన్‌ చేసుకునేందుకు సమస్యలు ఏర్పడ్డాయని, వాటిని పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంంటున్నామని రెవెన్యూశాఖ మంత్రి అనగాని సత్యప్రసాదు తెలిపారు. బుధవారం ఉదయం అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సందర్భంగా సభ్యులు పూసపాటి అదితి విజయలక్ష్మి, గౌతు శిరీష, మిరియాల శిరీషాదేవి, బండారు శ్రావణిశ్రీ, వేమిరెడ్డి ప్రశాంతి, కొణతాల రామకృష్ణ తదితర సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు. గత ప్రభుత్వం నిర్వహించిన సర్వేలో తలెత్తిన సమస్యలను దాదాపు 98 శాతం పరిష్కరించామని పేర్కొన్నారు. రీసర్వే ప్రాజెక్టును శాస్త్రీయంగా అమలు చేయకపోవడం వల్లనే ఈ సమస్యలు తలెత్తాయని పేర్కొన్నారు.. భూ యజమానుల కోరిక మేరకు సరిహద్దుల్లో తప్పులు దిదేందుకు బిఎస్‌ఓ 34 పేరా నెంబరు 8లో వీలు కల్పించామని చెప్పారు. ఇప్పటి వరకూ సబ్‌ డివిజన్‌ కోసం 85,571 దరఖాస్తులు రాగా 69,142 దరఖాస్తులు పరిష్కరించామని పేర్కొన్నారు. ప్రభుత్వం తీసుకున్న ప్రత్యేక చర్యల వల్ల రైతులు, భూయజమానులు తమ భూములు రిజిస్ట్రేషన్‌ చేసుకునే వీలు కలిగిందని తెలిపారు. గత ప్రభుత్వ కాలంలో 6688 గ్రామాల్లో రీ సర్వే పూర్తి చేశారని, అదంతా తప్పుల తడకగా మారిందని అన్నారు.

జర్నలిస్టుల సమస్యలపై…

జర్నలిస్టులకు ఏ మండలంలో రేషన్‌కార్డు ఉంటే ఆ మండలంలోనే ఇళ్లస్థలం ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నామని వివరించారు. భూ సంబంధం అంశాలపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం జర్నలిస్టులకు ఇళ్లస్థలాల కేటాయింపుపై అధ్యయనం చేసి సిఫార్సు చేస్తుందని తెలిపారు. సుప్రీం కోర్టు తీర్పు ఉన్న నేపథ్యంలో జర్నలిస్టులకు ఇళ్లస్థలాలు ఎలా ఇవ్వాలన్న కోణంలో కసరత్తు చేస్తున్నామని చెప్పారు. గత ప్రభుత్వం జర్నలిస్టులను మోసం చేసిందని పేర్కొన్నారు.

తలసేమియా రోగులకు ఉచితంగా రక్తం : మంత్రి సత్యకుమార్‌

తలసేమియా రోగులకు ఎంత రక్తం అవసరం అయితే అంత ఉచితంగా ఇస్తున్నామని వైద్యఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్‌ తెలిపారు. బిజెపి సభ్యులు విష్ణుకుమార్‌రాజు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం ఇచ్చారు. పరిస్థితి తీవ్రత, చికిత్స రకం, రోగి ప్రభుత్వ లేదా ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారా అనే అంశం అధారంగా ఖర్చు ఉంటుందని వివరించారు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం చికిత్స చేస్తున్నామని చెప్పారు. వారికి నెలకు రూ.10 వేల పెన్షన్‌ ఇస్తున్నామని వివరించారు.

➡️