- పోర్టు ఆధీనంలోనే నౌక : కలెక్టర్ షాన్‌మోహన్
ప్రజాశక్తి-కాకినాడ ప్రతినిధి : కాకినాడ యాంకరేజి పోర్టులో గుర్తించిన బియ్యాన్ని సమగ్రంగా తనిఖీ చేసేందుకు ఐదు ప్రభుత్వ శాఖల అధికారులతో కూడిన మల్టీ డిసిప్లినరీ కమిటీ ఏర్పాటు చేశామని కలెక్టర్ షాన్‌మోహన్ సగిలి తెలిపారు. కాకినాడ కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో ఎస్‌పి విక్రాంత్ పాటిల్‌తో కలిసి మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత నెల 27న కాకినాడ ఆర్‌డిఒతో కలిసి కాకినాడ యాంకరేజి పోర్టులో స్టెల్లా ఎల్ నౌకలో నిర్వహించిన తనిఖీల్లో పిడిఎస్ బియ్యాన్ని గుర్తించామన్నారు. ప్రస్తుతం స్టెల్లా ఎల్ షిఫ్ పోర్ట్ కంట్రోల్‌లోనే ఉందని స్పష్టం చేశారు. ఈ బియ్యం గతంలో సీజ్ చేసి బ్యాంకు గ్యారంటీపై రిలీజ్ చేసిన బియ్యమా? లేక పిడిఎస్ నుంచి తరలించిన బియ్యమా? అనేది నిర్ధారణ కావాల్సి ఉందన్నారు. దీని కోసం రెవెన్యూ, పోలీస్, కస్టమ్స్, పౌర సరఫరాలు, పోర్టు అధికారులతో కూడిన మల్టీ డిసిప్లినరీ కమిటీ ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ కమిటీ షిప్‌లో ఉన్న మొత్తం బియ్యాన్ని తనిఖీ చేసి నివేదిక ఇస్తుందన్నారు. బ్యాంకు గ్యారంటీ ఇచ్చిన బియ్యం ఎగుమతి చేయొచ్చా? లేదా? అనే అంశంపై లీగల్ ఒపీనియన్ తీసుకుంటున్నామని చెప్పారు. కమిటీ నివేదిక ఆధారంగా ఈ అంశంలో తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు. కాకినాడ పోర్ట్ ద్వారా ఎటువంటి అక్రమ కార్యకలాపాలూ జరుగకుండా ఉప ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు పటిష్టమైన చర్యలు చేపడుతున్నామన్నారు. ఇందులో భాగాంగానే కమిటీ అధికారులకు బియ్యాన్ని ఎలా తనిఖీ చేయాలి? శాంపిల్స్ ఎలా తీయాలి?, వాటిని ఎలా పరీక్షించాలి? అక్రమాలు గుర్తిస్తే కేసు నమోదు వంటి అంశాలపై ప్రత్యేక అవగాహన, శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. చెక్ పోస్ట్‌లను మరింత బలోపేతం చేస్తున్నామని చెప్పారు. 24 గంటలు తనిఖీలు నిర్వహించేలా మూడు షిప్ట్‌ల్లో శిక్షణ కల్పించిన బృందాలను నియమిస్తున్నామన్నారు. ఇతర జిల్లాల నుంచి కాకినాడ పోర్టుకు వచ్చే బియ్యాన్ని ఆయా జిల్లాల్లోనే తనిఖీ చేసేందుకు ప్రమాణిక విధి విధానాలను రాష్ట్ర స్థాయిలో రూపొందించి అమలు చేయనున్నారని తెలిపారు.