AP: ఇంటర్మీడియట్‌లో ఎన్‌సిఇఆర్‌టి సిలబస్‌

  • మొదటి సంవత్సరం పబ్లిక్‌ పరీక్షలు రద్దు
  • కమిషనర్‌ కృతికా శుక్లా వెల్లడి

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : విద్యారంగ నిపుణులతో నామమాత్రపు చర్చ కూడా జరపకుండా ఇంటర్మీడియట్‌ విద్యలో పలు సంస్కరణలను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఇంటర్మీడియట్‌ విద్య కమిషనర్‌, బోర్డు కార్యదర్శి కృతికా శుక్లా సంస్కరణల వివరాలను తెలిపారు. సంస్కరణలను అమలు చేస్తున్నట్లు చెబుతూనే సూచనలను, అభ్యంతరాలను తెలియజేయాలని ఆమె కోరారు. ఇంటర్మీడియట్‌లో జాతీయ విద్య పరిశోధన మండలి (ఎన్‌సిఇఆర్‌టి) సిలబస్‌ను అమలు చేయనున్నట్లు ఆమె చెప్పారు. నూతన విద్యావిధానం-2020కు అనుగుణంగా ఇంటర్‌లో మార్పులు తీసుకొస్తున్నట్లు ఆమె తెలిపారు. మొదటి సంవత్సరం విద్యార్ధులకు పబ్లిక్‌ పరీక్షలు ఉండవని, కానీ వార్షిక పరీక్షలు మాత్రం నిర్వహిస్తామని చెప్పారు. కేవలం ద్వితీయ సంవత్సరంలో మాత్రమే పబ్లిక్‌ పరీక్షలు ఉంటాయని తెలిపారు. వచ్చే విద్యాసంవత్సరం (2025-26)లో ఇంటర్‌ మొదటి సంవత్సరంలో, ఆ తరువాత విద్యా సంవత్సరం (2026-27) ద్వితీయ సంవత్సరంలో సైన్స్‌ సబ్జెక్టులలో పూర్తిగా ఎన్‌సిఇఆర్‌టి సిలబస్‌ను ప్రవేశపెడతామన్నారు. ఆర్ట్స్‌ సబ్జెక్టుల్లో బోర్డు పాఠ్యపుస్తకాలు ఉంటాయన్నారు. ఈ సంస్కరణల వల్ల నీట్‌, జెఇఇలలో విద్యార్థులు విజయం సాధించడానికి అవకాశం ఏర్పడుతుందని చెప్పారు. మూల్యాంకన విధానంలో సిబిఎస్‌ఇ, ఇతర రాష్ట్ర విద్యామండలిలో సారూప్యత, సమానత్వం సాధించాలంటే ప్రధమ సంవత్సరం పబ్లిక్‌ పరీక్షలను తొలగించాల్సిన అవసరం ఉందన్నారు. నూతన సంస్కరణలను తమ బోర్డు వెబ్‌సైట్‌ bieap. gov.in లో పొందుపరిచామని, ప్రజలు, విద్యా ర్థులు, తల్లిదండ్రులు, విద్యావేత్తలు ఈ నెల 26వ తేదిలోపు [email protected] మెయిల్‌ ద్వారా సలహాలు, సూచనలు, అభ్యంతరాలను తెలపవచ్చని చెప్పారు.

సిబిఎస్‌ఇ విధానం ఇలా…

ఇంటర్మీడియట్‌ విద్య విధానం సిబిఎస్‌ఇ విధానంలోకి మారనుంది. ప్రస్తుతం ప్రధమ, ద్వితీయ విద్యార్థులకు రెండు భాషలతో పాటు ఆ గ్రూపునకు సంబంధించిన సబ్జెక్టులు ఉంటాయి. సైన్స్‌ విద్యార్ధులకు నాలుగు సబ్జెక్టులు, ఆర్ట్స్‌ విద్యార్ధులకు మూడు సబ్జెక్టుల విధానం ఉంది. ఇప్పుడు ఎంపిసి విద్యార్థులకు ఉన్న మ్యాథ్స్‌ రెండు పేపర్లను ఒకే పేపర్‌గా, బైపిసి విద్యార్ధులకు రెండుగా ఉన్న బొటానీ, జువాలజీని ఒకే పేపర్‌గా తీసుకొస్తున్నారు.

నూతన సబ్జెక్టుల కాంబినేషన్లు ఇలా..

ఇంగ్లీష్‌ సబ్జెక్టు అందరికీ కచ్చితంగా ఉంటుంది. ద్వితీయ సబ్జెక్టుగా ఏదైనా భాష గానీ లేదా ఇతర గ్రూపునకు చెందిన ప్రధాన సబ్జెక్టుగానీ ఎంపిక చేసుకోవచ్చు. దీనికోసం 23 ఆప్షన్లు ఉంటాయి. అంటే, ఎంపిసి చదివే విద్యార్ధులు జువాలజీ, బొటానీ సబ్జెక్టు గానీ, ఆర్ట్స్‌ సబ్జెక్టుగానీ తీసుకోవచ్చు. మూడు, నాలుగు, ఐదో సబ్జెక్టులు ఎంపిక చేసుకున్న గ్రూప్‌ సబ్జెక్టులు ఉంటాయి. ఐచ్ఛికంగా 6వ సబ్జెక్టు ఉంటుంది. దీనికి కూడా భాష లేదా ఇతర గ్రూపునకు చెందిన (23 ఆప్షన్ల నుండి) ప్రధాన సబ్జెక్టును ఎంపిక చేసుకోవచ్చు. ప్రధానంగా ఎంచుకున్న ఐదు సబ్జెక్టులలో ఒకటి తప్పితే, ఆప్షన్‌ సబ్జెక్టు పాసయితే దానిని పరిగణనలోకి తీసుకొని విద్యార్థులను ఉత్తీర్ణులు చేస్తారు. ఈ విధానం అమలవ్వాలంటే ఐదు ప్రధాన సబ్జెక్టులలో ఇంగ్లీష్‌ తప్పనిసరిగా ఉండాలి.

మార్కుల విధానం ఇలా

ఇప్పటి వరకు ప్రథమ సంవత్సరంలో 500 మార్కులకు, ద్వితీయ సంవత్సరంలో 500 మార్కులకు పరీక్షలు జరుగుతున్న సంగతి తెలిసిందే. నూతన విధానంలో మార్కులు అదే మాదిరి ఉన్నప్పటికీ, ఉత్తీర్ణత శాతం కోసం ప్రథమ సంవత్సరం మార్కులను పరిగణనలోకి తీసుకోవడం లేదు. ద్వితీయ సంవత్సరం మార్కులనే పరిగణనలోకి తీసుకొని ఉత్తీర్ణత శాతం విద్యార్ధులకు కేటాయిస్తారు. ఈ విధానంలో ప్రతి సబ్జెక్టులోకు అంతర్గత మార్కులు ఉంటాయి. ఇంగ్లీష్‌తో పాటు ఎంచుకున్న సబ్జెక్టుకు థియరీ మార్కులు 80, అంతర్గత మార్కులు 20 ఉంటాయి. సైన్స్‌, ఆర్ట్స్‌ విద్యార్ధులకు ఇలానే ఉంటుంది. సైన్స్‌ సబ్జెక్టుల్లో థియరీ 70 మార్కులు, అంతర్గత మార్కులు 30 ఉంటాయి. ఆర్ట్స్‌ గ్రూపు సబ్జెక్టుల్లో ప్రధాన సబ్జెక్టులకు థియరీ 80 మార్కులు, అంతర్గత మార్కులు 20 ఉంటాయి. అదేవిధంగా ప్రశ్నాపత్రాల్లో ఒక మార్కు ప్రశ్నాలను, 5, 6 మార్కుల ప్రశ్నలను ప్రవేశపెట్టనున్నారు.

విస్తృతమైన చర్చ జరగాలి : కె.ఎస్‌ లక్ష్మణరావు

ఇంటర్మీడియట్‌ విద్యలో చేపట్టే మార్పులపై విస్తృతమైన చర్చ జరగాల్సి ఉందని పిడిఎఫ్‌ ఎంఎల్‌సి కె.ఎస్‌ లక్ష్మణరావు అన్నారు. ప్రజాశక్తితో ఆయన మాట్లాడుతూ ఇప్పుడు సిలబస్‌లో ఉన్న మ్యాథ్స్‌, సైన్స్‌ సబ్జెక్టులు జాతీయ పోటీ పరీక్షకు కూడా ఉపయోగంగా ఉన్నాయని చెప్పారు. నిర్ణయాలు తీసుకునే ముందు విద్యావేత్తలు, మేథావులు, విద్యారంగ నిపుణులు తదితరులతో చర్చ చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. ప్రభుత్వం కనీసం ఎమ్మెల్సీలతో కూడా చర్చించలేదని చెప్పారు.

➡️