Survey – ఎపి ప్రభుత్వం కీలక నిర్ణయం – వర్క్‌ ఫ్రమ్‌ హోం పై సర్వే ..!

అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.. వర్క్‌ ఫ్రమ్‌ హోం పై కూడా సర్వే నిర్వహించాలని నిర్ణయించింది. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులతో చేపట్టే ఈ సర్వేలో ప్రతి ఇంట్లో 18 ఏండ్ల నుంచి 50 ఏండ్ల లోపు ఉన్నవారి వివరాలను సేకరిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా టెక్నీకల్‌ స్కిల్‌, విద్యార్హతలు, ప్రస్తుతం చేస్తున్నపనికి సంబంధించి వివరాలను సేకరిస్తారు. మార్చి 10వ తేదీ వరకు ఈ సర్వేను ఎపి ప్రభుత్వం చేపట్టనుంది. సర్వే తర్వాత వర్క్‌ ఫ్రమ్‌ హోం కు ఎక్కువ మంది ఆసక్తి చూపితే.. ప్రత్యేక సెంటర్లను కూడా ఏర్పాటు చేసే దిశగా ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. బ్రాండ్‌ బ్యాండ్‌ కనెక్టవిటీ.. స్పీడ్‌ ఇంటర్‌ నెట్‌.. తగిన వసతి కల్పనపై ప్రభుత్వం దృష్టి పెట్టనుంది. కరోనా తరువాత దిగ్గజ కంపెనీలు కూడా ఉద్యోగులను వర్క్‌ ఫ్రమ్‌ హోం మోడ్‌లోకి తీసుకెళ్లాయి. ఇప్పటికే పలు కంపెనీల్లో ఈ పద్ధతి కొనసాగుతోంది. కొన్ని సంస్థల్లో వారానికి ఒకటి రెండు సార్లు వర్క్‌ ప్లేస్‌కు వస్తే సరిపోతుందనే రూల్‌ కూడా ఉంది. మిగతా రోజుల్లో ఇంటి నుంచే పనిచేసుకునే వెసులుబాటు కూడా కొన్ని కంపెనీలు కల్పించాయి. ఇప్పటికే రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా పలు సంస్థలను ఆహ్వానిస్తున్న కూటమి ప్రభుత్వం ఇదే సమయంలో.. వర్క్‌ ఫ్రమ్‌ హోంకు మొగ్గుచూపే వారిపై దృష్టి పెట్టింది. దీనిపై సర్వేకు సిద్ధమవుతోంది.

➡️