- సిపిఎం రాష్ట్ర నూతన కార్యదర్శి వి.శ్రీనివాసరావు
- రాష్ట్ర ప్రజలు బిజెపిని అంగీకరించడం లేదు
ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : రాష్ట్రంలో కలిసి వచ్చే ప్రజాతంత్ర శక్తులు, సంస్థలు, సంఘాలను కలుపుకుని ప్రజా సమస్యలపై విశాల ప్రజా ఉద్యమాలు నిర్వహిస్తామని, సిపిఎం 27వ రాష్ట్ర మహాసభ అందుకనుగుణంగా కార్యాచరణ రూపొందించిందని సిపిఎం రాష్ట్ర నూతన కార్యదర్శి వి.శ్రీనివాసరావు అన్నారు. నెల్లూరులో జరుగుతున్న సిపిఎం రాష్ట్ర 27వ మహాసభ ముగింపు సందర్భంగా నెల్లూరులోని కామ్రేడ్ మల్లు స్వరాజ్యం ప్రాంగణం (విఆర్ కళాశాల గ్రౌండు)లో సోమవారం సాయంత్రం జరిగిన బహిరంగసభలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ప్రజలెదుర్కొంటున్న సమస్యలపై మహాసభ చర్చించి పలు తీర్మానాలను ఆమోదించిందని తెలిపారు. రాష్ట్రంలో సహజ వనరులను దోచుకునేందుకు వచ్చిన కార్పొరేట్ దోపిడీదారులకు రెడ్ కార్పెట్ వేస్తున్నారన్నారు. అభివృద్ధి అంటే ప్రజలు బాగుపడేలా ఉండాలని, దోపిడీకి గురయ్యేలా ఉండకూడదని పేర్కొన్నారు. సూపర్ సిక్స్ హామీలు గాలికి వదిలేశారని, వాటిని అమలు చేసే వరకూ ఊరుకునేది లేదని, పెద్దఎత్తున పోరాటం చేస్తామని తెలిపారు. ఎన్నికల ముందు హామీలు గుప్పించి అధికారంలోకి రాగానే మర్చిపోయారని అన్నారు. రాష్ట్ర ప్రజలను నమ్మించి గొంతుకోశారని తెలిపారు. రాష్ట్రం దివాళా తీసిందని, తానొస్తే అభివృద్ధి చేస్తానని చెప్పి ఇప్పుడు ప్రజలపై భారాలు వేస్తానని చెప్పకనే చెబుతున్నారని తెలిపారు. గతంలో పిపిపి ఉండేదని, ఇప్పుడు ప్రజలను కూడా చేర్చి పి4 విధానం అంటున్నారని, అంటే అన్నిటినీ ప్రైవేటుపరం చేయడమేనని తెలిపారు. దీన్ని ఎదుర్కొంటామని, ప్రజలపై భారాలు వేయనీయబోమని అన్నారు.
రాష్ట్రానికి రావాల్సిన నిధులు కేంద్రం నుండి తీసుకురావడంలో విఫలమైన చంద్రబాబు ప్రజలపై భారాలు వేసే పనికి దిగారని తెలిపారు. బడ్జెట్లో కనీసం ఎపి పేరు ఎత్తకపోయినా మోడీనిగానీ, నిర్మలా సీతారామన్‌నుగానీ ప్రశ్నించే ధైర్యం కూటమి ఎంపిలు చేయలేకపోయారని అన్నారు. కేంద్రంలో మోడీ ప్రభుత్వం టిడిపిపై ఆధారపడి నడుస్తోందని, అయినా చంద్రబాబునాయుడు అడిగేందుకు ఇష్టపడటం లేదని పేర్కొన్నారు. కేంద్రంలో చక్రం తిప్పానని పదేపదే చెప్పే చంద్రబాబు ఇప్పుడు ఎందుకు అడగడం లేదో ప్రజలకు చెప్పాలన్నారు. పైగా ప్రతిపక్షంలో ఉండగా విద్యుత్ భారాలను, స్మార్ట్ మీటర్లను వ్యతిరేకించిన చంద్రబాబు అధికారంలోకి రాగానే వాటిని కొనసాగిస్తున్నారని, గతంలో జగన్ చేసిన వాటినే కొనసాగిస్తున్నారని తెలిపారు. ప్రజలను దోచుకోవడంలో వీరిద్దరి మధ్య తేడా ఏమీ లేదని పేర్కొన్నారు. స్మార్ట్ మీటర్లలో జగన్ సెకీ ఒప్పందంలో లంచం తీసుకున్నాడని అమెరికా కంపెనీ చెప్పిందని, దాన్ని రద్దు చేయడానికి చంద్రబాబు తిరస్కరిస్తున్నారని అన్నారు. అంటే అవినీతిని ఆమోదించారా అని ప్రశ్నించారు. అదే నిజమైతే జగన్‌కు, చంద్రబాబుకు తేడా ఏమిటో ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. అప్పుల పేరుతో ప్రజలపై భారాలు వేస్తున్నారని, ఆరు నెలలు తిరగకుండానే విద్యుత్ సర్దుబాటు ఛార్జీల భారాలు మోపారని, దీనివల్ల ప్రజల్లో అసంతృప్తి రగులుతోందని అన్నారు. రాష్ట్రంలో ప్రజలు బిజెపిని అంగీకరించడం లేదని, టిడిపి, జనసేన మద్దతుతో ఇక్కడ కొన్ని సీట్లు, ఓట్లు రాబట్టుకున్నా ప్రజా మద్దతు మాత్రం ఆ పార్టీకి లేదని అన్నారు. పెద్దఎత్తున పెట్టుబడులు తెస్తానని కార్పొరేట్ల చుట్టూ తిరుగుతున్న చంద్రబాబు ప్రత్యేక హోదా తీసుకొస్తే కార్పొరేట్లు రాష్ట్రానికి క్యూ కడతారని, ఆ పని చేయకుండా బిజెపి భజన చేస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు అనుసరిస్తున్న విధానాలతో రాష్ట్రం దివాళా తీస్తోందని, కేంద్రం నుండి రావాల్సిన బకాయిలు, జిఎస్‌టి వాటా, పోలవరం, రాజధాని, వెనుకబడిన ప్రాంతాలకు కేటాయించిన నిధులు తీసుకొస్తే అప్పులు చేయాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చిత్తశుద్ధి ఉంటే వెనుకబడిన ప్రాంతాలను అభివృద్ధి చేయాలని అన్నారు. ఆదాయం ఆస్తులు పెరగాలంటే భూములు పంచాలని, ఉద్యోగుల వేతనాలు పెంచాలని, పిఆర్‌సి వేయాలని కోరారు. పోలవరానికి పైసా విదల్చని కేంద్రాన్ని చంద్రబాబు ప్రశ్నించడం మానేశారని తెలిపారు. విశాఖ ఉక్కును ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఎంపిలు పోరాడాలని అన్నారు. అయితే పక్కనే ఉన్న నక్కపల్లిలో ఆర్సెల్లార్ మిట్టల్ ప్లాంటు ఏర్పాటుపై శ్రద్ధ పెడుతున్నారని దీనివల్ల తీరని నష్టం వాటిల్లుతుందని అన్నారు. గతంలో అవినీతి గురించి నిరంతరం మాట్లాడిన టిడిపి, జనసేన, బిజెపి నాయకులు ఇప్పుడు దాన్ని క్యాష్ అండ్ క్యారీగా మార్చారని, అవినీతిలో మార్పు లేదని విమర్శించారు.