- 15 గొర్రెలు మృతి, కాపరికి తీవ్ర గాయాలు
ప్రజాశక్తి-బత్తలపల్లి : అనంతపురం-కదిరి జాతీయ రహదారిపై జ్వాలాపురం క్రాస్ సమీపంలో గొర్రెల మందపై ఓ లారీ దూసుకెళ్లింది. ఈ ఘటనలో 15 మూగజీవాలు మృతి చెందాయి. కాపరి తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. శ్రీ సత్యసాయి జిల్లా బత్తలపల్లి మండలం కోడేకండ్ల గ్రామానికి చెందిన ఓబుళపతి తన భార్యతో కలిసి జీవాలకు మేత కోసం వాటిని తీసుకువెళ్తుండగా జ్వాలాపురం క్రాస్ నుంచి రోడ్డు దాటిస్తున్న సమయంలో కదిరి నుంచి బత్తలపల్లికి వెళ్తున్న లారీ వేగంగా వచ్చి మందపైకి దూసుకెళ్లింది. లారీ వస్తున్న విషయాన్ని గుర్తించి దానిని ఆపేందుకు ఓబుళపతి అడ్డుగా వెళ్లగా అతన్ని ఢకొీట్టింది. దీంతో ఆయన తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ప్రమాదంలో 15 మూగ జీవాలు మరణించాయి. మరో 25 తీవ్రంగా గాయపడ్డాయి. సమీప రైతులు, కూలీలు ఘటనాస్థలికి చేరుకుని ఓబుళపతిని చికిత్స నిమిత్తం ఆర్‌డిటి ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం అనంతపురంలోని ఓ ప్రయివేటు ఆసుపత్రికి తరలించారు. వాహనాన్ని వదిలి లారీ డ్రైవర్ పారిపోయాడు.