ఎపి కల్లు గీత కార్మిక సంఘం
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలో గీత కార్మికుల పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్లుగా ఉందని ఎపి గీత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జుత్తిగ నరసింహమూర్తి అన్నారు. రాష్ట్ర విభజన అనంతరం ప్రభుత్వమే కల్లు గీత వృత్తిని సంక్షోభంలోకి నెట్టేసిందని చెప్పారు. విజయవాడలోని ఎంబివికెలో ఎపి కల్లు గీత కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సమావేశం ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా కల్లు గీత వృత్తిలో మార్పులు తెచ్చి అభివృద్ధి చేసి ప్రోత్సహించి కేరళ, తెలంగాణ రాష్ట్రాల తరహాలో లక్షలాది గీత కుటుంబాలకు ఉపాధి పెంచి ఆదుకోవాలని కోరారు. ఎన్నో ఔషధ గుణాలు ఉన్న సహజ సిద్ధమైన తాటికల్లును రసాయనలతో తయారయ్యే బీరు, బ్రాందీ, విస్కీలతో పోల్చవద్దన్నారు. గోవా, యానం తదితర ప్రాంతాల నుంచి రాష్ట్రానికి అక్రమ మద్యం వరదలా వస్తుందన్నారు. ప్రభుత్వం మారింది… గీత కార్మికుల తలరాతలు మారుతాయని ఎదురు చూసిన లక్షలాది గీత కార్మికుల కుటుంబాలకు కూటమి ప్రభుత్వం చుక్కులు చూపిస్తుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా విచ్ఛలవిడిగా బెల్ట్ షాపులు నడుస్తున్నాయని, ఇవి కాకుండా మోటారు సైకిళ్లు, వ్యాన్‌లలో మొబైల్ షాపులు విక్రయాలు సాగిస్తున్నాయని తెలిపారు. దీంతో కల్లు అమ్మకాలు లేక గీత కార్మికుల కుటుంబాలు సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నాయని చెప్పారు. ప్రమాదవశాత్తు తాటి చెట్టుపై నుంచి పడి చనిపోతున్న గీత కార్మికులకు ఎక్స్‌గ్రేషియా రూ.10 లక్షలు ఇవ్వాలని, ప్రభుత్వానికి గీత కార్మికులకు మధ్య వారధిలా పని చేసే గీత కార్మిక ఆర్ధిక సంస్థలకు రూ.వెయ్యి కోట్లు నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. వృత్తి సంఘాల రాష్ట్ర కన్వీనర్ ఎం.భాస్కరయ్య పలు అంశాలపై ప్రసంగించారు. ఈ సమావేశంలో సంఘం నాయకులు కమన మునిస్వామి, బక్కా చంటి, ఎమినేని స్టాలిన్, యర్రా దేవుడు, కడలి పాండు, బత్తెన నాగేశ్వరరావు. జుత్తిగ సంతోష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
