ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్ : గంజాయి సేవిస్తున్న ఇద్దరు యువకులను శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకొని పోలీసులకు అప్పగించారు. శ్రీకాకుళం నగరంలోని పొట్టి శ్రీరాములు పెద్ద మార్కెట్‌లో నిరుపయోగంగా ఉన్న మార్కెట్ భవనాలను అధికారులతో కలిసి ఆయన మంగళవారం పరిశీలించారు. ఆ సమయంలో భవనంపై అనుమానాస్పదంగా ఉన్న ఇద్దరిని ఎమ్మెల్యే గుర్తించారు. ఎమ్మెల్యే, ఆయన సెక్యూరిటీ సిబ్బంది వారిని ప్రశ్నించి తనిఖీ చేయగా, వారు గంజాయి సేవిస్తున్నట్టు బయటపడింది. దీంతో ఎమ్మెల్యే శంకర్ ఒకటో పట్టణ పోలీసులకు ఫోన్ చేసి ఇద్దరిని అప్పగించారు. వారిని అదుపులోకి తీసుకొని వారి నుంచి గంజాయి సేవించడానికి వినియోగిస్తున్న బాటిల్, గంజాయి దట్టించిన గొట్టం, సెల్‌ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాగా, గంజాయి సేవిస్తున్న యువకులను పట్టుకున్నట్టు ఒకటో పట్టణ పోలీసులకు సమాచారం ఇచ్చినా, కూతవేటు దూరంలో ఉన్న పోలీస్‌స్టేషన్ నుంచి పోలీసులు ఆలస్యంగా రావడంపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. గంజాయి విక్రయించే వారిపై ఉక్కుపాదం మోపాలని పోలీసులకు సూచించారు.
