సమీకరణ సేకరణ నిర్ణయించలేదు

  • అమరావతిలో 30 వేల ఎకరాలపై మంత్రి నారాయణ

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : అమరావతిలో ఎయిర్‌పోర్టు నిర్మాణం, స్మార్ట్‌ ఇండిస్టీస్‌కు, అవసరమైన 30 వేల ఎకరాల భూమిని సేకరించాలా, సమీకరించాలా అనే విషయాన్ని ఇంకా తేల్చలేదని పట్టణాభివృద్ధిశాఖ మంత్రి నారాయణ తెలిపారు. బుధవారం ఉదయం వెలగపూడి సెక్రటేరియట్లో ఆయన మీడియాతో మాట్లాడారు. అమరావతి నిర్మాణం అంటే మౌలిక వసతుల కల్పన మాత్రమే కాదని, జనాభా రావాలని, యువతకు ఉద్యోగాలు రావాలని ఇవి జరగాలంటే స్మార్ట్‌ ఇండిస్టీస్‌ రావాలని అన్నారు. రైతుల భూముల ధరలు నిలవాలన్నా, పెరగాలన్నా పరిశ్రమల ఏర్పాటు ముఖ్యమని పేర్కొన్నారు. అమరావతిలో కాలుష్యరహిత పరిశ్రమలు ఏర్పాటు ద్వారా ఉద్యోగాలు కల్పించాలని సిఎం నిర్ణయించారని తెలిపారు. దీనికోసం విదేశీ పెట్టుబడిదారులు వస్తారని, దీనికోసం ఎయిర్‌పోర్టు అవసరమని పేర్కొన్నారు. అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటుకు ఐదువేల ఎకరాల భూమి అవసరమని అన్నారు. ఇప్పటికే అమరావతిలో 64 వేలకోట్ల విలువైన పనులకు ఆమోదం లభించిందని, చాలా వరకూ టెండర్లు పూర్తయి పనులు కూడా ప్రారంభమయ్యాయని చెప్పారు. దీనిపై కొంతమంది అపోహలు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని, వాటిని నమ్మొద్దని కోరారు.

➡️