చంద్రగిరిలో కొనసాగుతున్న హైటెన్షన్‌.. 144 సెక్షన్‌ అమలు

చంద్రగిరి (తిరుపతి) : తిరుపతి జిల్లా చంద్రగిరిలో హై టెన్షన్‌ వాతావరణం కొనసాగుతుంది. పద్మావతి వర్శిటి స్టాంగ్‌ రూమ్‌ దగ్గర పోలీసులు భారీ భద్రతతోపాటు 144 సెక్షన్‌ విధించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చంద్రగిరి టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నానిని ఈ రోజు సాయంత్రం డిశార్జ్‌ చేసే అవకాశం ఉంది. మహిళా యూనివర్సిటీ దగ్గర వైసిపి నేతల దాడిలో గాయపడిన పులివర్తి నాని, గన్‌మ్యాన్‌ ధరణి కోలుకున్నారు. పులివర్తి నాని ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. రామచంద్రాపురం జెడ్పీటీసీ ఢిల్లీరాణి భర్త భాను ప్రకాష్‌ రెడ్డి, నడవలూరు సర్పంచ్‌ గణపతి రెడ్డి ప్రధాన నిందితులుగా గుర్తించారు. పులివర్తి నానిపై దాడికి పాల్పడింది మొత్తం 30 మంది అని పోలీసులు గుర్తించారు. అందులో ఇప్పటి వరకు ముగ్గురుని అదుపులోకి తీసుకోగా.. మిగిలినవారంతా పరారీలో ఉన్నట్లు సమాచారం. వెంటనే వారిని అరెస్ట్‌ చేయకపోతే చంద్రగిరిని దిగ్భందిస్తామని పులివర్తి నాని భార్య పులివర్తి సుధారెడ్డి హెచ్చరించింది. దీంతో పులివర్తి సుధారెడ్డి వార్నింగ్‌ తో చంద్రగిరిలో భారీగా పోలీస్‌ బలగాలు మోహరించాయి. ఎప్పుడు ఏం జరుగుతుందోనని ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి. ఈ ఘటనపై చర్యలు తీసుకోవాలని డీజీతో మాట్లాడి, ఎన్నికల కమిషన్‌ కు టిడిపి అధినేత నారా చంద్రబాబు ఫిర్యాదు చేశారు.

➡️