స్పెషల్‌ డిఎస్‌సి నోటిఫికేషన్‌కు ఆర్డినెన్స్‌ విడుదల చేయాలి

girijana leader killo suredra on dsc
  • మే 2న ఏజెన్సీ బంద్‌ : సురేంద్ర

ప్రజాశక్తి – కురుపాం (పార్వతీపురం మన్యం జిల్లా) : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఏజెన్సీలో స్పెషల్‌ డిఎస్‌సి నోటిఫికేషన్‌ విడుదలకు తక్షణమే ఆర్డినెన్స్‌ విడుదల చేయాలని ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కిలో సురేంద్ర డిమాండ్‌ చేశారు. పార్వతీపురం మన్యం జిల్లా జియ్యమ్మవలస మండలం రావాడ రామభద్రపురంలో ఆయన మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ మెగా డిఎస్‌సి నోటిఫికేషన్‌లో ఏజెన్సీలోని 882 పోస్టులు ఆదివాసీలకు దక్కాల్సి ఉండగా, కేవలం 45 మాత్రమే ఉన్నాయని తెలిపారు. దీంతో ఆదివాసీ నిరుద్యోగ అభ్యర్థులు తీవ్ర అన్యాయానికి గురయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. జిఒ 3 వల్ల ఆదివాసీ ప్రాంతంలో నూరు శాతం ఉద్యోగ, ఉపాధ్యాయ నియామకాల్లో న్యాయం జరిగేదని, ఈ జిఒ రద్దుతో ఆదివాసీలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఏజెన్సీ ప్రాంతాల్లో స్పెషల్‌ డిఎస్‌సి నోటిఫికేషన్‌ విడుదలకు ఆర్డినెన్స్‌ తీసుకొచ్చి ఏజెన్సీ ప్రాంతాల్లో వంద శాతం ఉద్యోగ, ఉపాధ్యాయ ఉద్యోగాలివ్వాలని డిమాండ్‌ చేశారు. షెడ్యూల్‌ ఏరియాలో లేని గిరిజన గ్రామాలను షెడ్యూల్‌ ఏరియాలో కలిపి ఆదివాసీల భూములకు, అడవులకు రక్షణ కల్పించాలని కోరారు. ఆదివాసీ స్పెషల్‌ డిఎస్‌సి సాధన కమిటీ ఆధ్యర్యంలో మే 2న పిలుపు ఇచ్చిన ఏజెన్సీ బంద్‌కు ఆదివాసీ గిరిజన సంఘం సంపూర్ణ మద్దతు ఇస్తుందని, అలాగే ఆదివాసీ గిరిజన సంఘం నాయకులు బంద్‌లో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

➡️