రాజమండ్రి : రాజమండ్రి సమీపంలో కావేరి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం సంభవించింది. బస్సు అదుపు తప్పి బోల్తా పడిన ఘటనలో విశాఖకు చెందిన యువతి మృతి చెందగా, సుమారు 20 మంది గాయపడ్డారు. విశాఖపట్నం నుంచి హైదరాబాద్ కు గత రాత్రి బయలుదేరిన కావేరి ట్రావెల్ బస్సు అర్ధరాత్రి సమయంలో రాజమండ్రి గామన్ వంతెన రహదారిపై బోల్తా పడింది. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు, ఇతర సహాయక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిలో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉండడంతో కాకినాడ జిల్లా ఆసుపత్రికి తరలించారు. మరికొందరిని రాజమహేంద్రవరం జీజీహెచ్ తరలించారు. వీరంతా విశాఖ, అన్నవరం ప్రాంతాలకు చెందినవారుగా తెలుస్తోంది. ప్రమాద సమయంలో 40 మంది ప్రయాణికులు బస్సులో ఉన్నారు. బస్సు కింద ఖాళీ ప్రదేశంలో ఎక్కువమంది ఇరుక్కోవడంతో ప్రాణాలతో బయటపడగలిగారు. క్రేన్ సాయంతో రాత్రి బోల్తాపడిన బస్సును తొలగించి కింద ఉన్న మరికొంతమందిని రక్షించారు. ఘటనపై రాజమండ్రి టౌన్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
