విద్యార్థినిపై జరిగింది భౌతికదాడే

  • శ్రీకాకుళం ఘటనపై హోంమంత్రి అనిత

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఇటీవల శ్రీకాకుళం యువతిపై భౌతికదాడి జరిగిందని, లైంగిక దాడి కాదని హోంమంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు. ఈ అంశంపై వైసిపి నేత, మాజీ మంత్రి ధర్మాన కృష్ణదాస్‌ విషప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టిడిపి కార్యాలయంలో శనివారం ఆమె విలేకరులతో మాట్లాడారు. ఆడబిడ్డలపై అనవసర నిందలేసి వీధిన పెట్టే ప్రయత్నం చేసిన వారిని జైల్లో పెడతామని హెచ్చరించారు. శ్రీకాకుళం ఘటనలో తప్పుడు సమాచారం అందించిన హాస్టల్‌ వార్డెన్‌ను సస్పెండ్‌ చేశామన్నారు. కూటమి ప్రభుత్వంలో రాష్ట్రంలో 10 శాతం నేరాలు తగ్గాయని చెప్పారు. ఆడపిల్లలు, మహిళల రక్షణకు ప్రభుత్వం తొలి ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. డ్రోన్లు, సిసి కెమెరాలు వినియోగించి నేర రహిత సమాజం దిశగా సంకల్పంతో అడుగులు వేస్తున్నామని తెలిపారు. సోషల్‌ మీడియాను మంచి జరగడానికి ఉపయోగించాలని సూచించారు.

➡️