– పుస్తకావిష్కరణ సభలో సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బివి.రాఘవులు
– వీరోచిత పోరాట యోధుడు రామం : ఎంఎ బేబీ
ప్రజాశక్తి – నరసాపురం : గొప్ప నిష్కళంక దేశభక్తుడు ఉద్దరాజు రామం అని సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బివి.రాఘవులు అన్నారు. ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు, మాజీ ఎంపి, సిపిఎం నేత ఉద్దరాజు రామం జీవన యానంపై ప్రచురించిన ‘ఉద్యమాల శిఖరం.. ఉద్దరాజు రామం’ పుస్తకాన్ని రాఘవులు ఆవిష్కరించారు. స్థానిక అల్లూరి సత్యనారాయణరాజు సాంస్కృతిక కేంద్రంలో గురువారం సాయంత్రం జరిగిన పుస్తకావిష్కరణ సభకు సిపిఎం జిల్లా కార్యదర్శి బి.బలరాం అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా రాఘవులు మాట్లాడుతూ.. బ్రిటీష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సాగిన స్వాతంత్య్ర పోరాటంలో అత్యంత ధైర్య సాహసాలను ప్రదర్శించారన్నారు. అనేక సంవత్సరాలు జైలులో నిర్బంధించినా పట్టుదలతో ఉద్యమాన్ని కొనసాగించారని చెప్పారు. కుల వివక్షకు వ్యతిరేకంగా సుందరయ్యతో కలిసి ఉద్దరాజు రామం గొప్ప పోరాటం చేశారని కొనియాడారు. ప్రస్తుతం దేశంలో మత వివక్ష పెరుగుతోందని, ఈ పోకడలకు వ్యతిరేకంగా పోరాటం సాగించాలని పిలుపునిచ్చారు. ముఖ్యఅతిథి సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు ఎంఎ.బేబీ మాట్లాడుతూ.. దేశ స్వాతంత్రం కోసం సోషలిస్టులు, కమ్యూనిస్టులు, ఇతర అనేక శక్తులు పోరాటం జరిపాయని గుర్తు చేశారు. ఆ పోరాటంలో వీరోచితంగా పాల్గన్న నాయకుడు ఉద్దరాజు రామం అని కొనియాడారు. కేరళ రాష్ట్రంలో ఇఎంఎస్.నంబూద్రిపాద్ నాయకత్వాన తొలి కమ్యూనిస్టు ప్రభుత్వం ఏర్పడిందని, ఆ ప్రభుత్వాన్ని ప్రజాస్వామ్య విరుద్ధంగా అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం కూల్చివేసిందన్నారు. ఆ సమయంలో ఉద్దరాజు రామం పార్లమెంట్‌లో కాంగ్రెస్ ప్రభుత్వ చర్యను తీవ్రంగా నిలదీశారని గుర్తు చేశారు. ఈ సభలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎంఎ.గఫూర్, మంతెన సీతారాం, డి.రమాదేవి, కె.సుబ్బరావమ్మ, ప్రముఖులు డివిఎస్.వర్మ, సీనియర్ జర్నలిస్టు ఎం.కోటేశ్వరరావు, రామం తనయుడు ఉద్దరాజు బాపిరాజు, మనవరాలు శారద తదితరులు మాట్లాడారు.
