ఓటర్ల నిరసనలు – వెలవెలబోతున్న పోలింగ్‌ కేంద్రాలు..!

తెలంగాణ : ఓటరు సత్తా తెలిసేది ఓటేసే రోజే … ఈ సార్వత్రిక ఎన్నికలప్పుడే కదా…! మా సమస్యలు పట్టించుకోండయ్యా.. అంటూ అన్నదాతలు, ప్రజలు ఎంత మొత్తుకున్నా… కన్నెత్తి కూడా చూడని పాలకులు, నాయకులు ఇప్పుడు ఓట్ల కోసం మీతోనే మేము అంటూ… ఓటర్లను బుజ్జగిస్తుంటారు. ముందుగా మా సమస్యల్ని పరిష్కరించండి-అప్పుడు ఓటేస్తాం అంటూ .. అన్నదాతలు, బాధిత ప్రజలు తెలంగాణలో నిరసన చేపట్టారు.

తడిసిన ధాన్యంతో రైతుల ధర్నా….
తెలంగాణలో లోక్‌ సభ ఎన్నికలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో … తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్‌ పోచంపల్లి మండలం కనుముక్కల గ్రామ రైతులు ధర్నాకు దిగారు. ధాన్యం కొనుగోలు చేస్తేనే.. ఓటు వేస్తాం అని తడిసిన ధాన్యం బస్తాలతో పోలింగ్‌ కేంద్రం దగ్గర నిరసన తెలిపారు. దాంతో కనుముక్కల గ్రామంలో ఇంకా పోలింగ్‌ ప్రారంభం కాలేదు..

బ్రిడ్జి నిర్మించండి : రాయమాదారం గ్రామ ప్రజలు
ఖమ్మం జిల్లాలోని ఏన్కూర్‌ మండలం రాయమాదారం గ్రామ ప్రజలు లోక్‌సభ పోలింగ్‌ను బహిష్కరించారు. ఎన్‌ఎస్పీ కాలువపై బ్రిడ్జి నిర్మించాలంటూ నిరసన తెలుపుతున్నారు. ఈ నిరసనలో రాయమాదారం గ్రామ ప్రజలు అందరూ పాల్గన్నారు. దాంతో రాయమాదారంలో పోలింగ్‌ బూత్‌ వెలవెలబోయింది.

గుట్ట మైనింగ్‌ ను రద్దు చేయండి : మైలారం గ్రామస్తులు
నాగర్‌ కర్నూలు జిల్లాలోని బల్మూర్‌ మండలం మైలారం గ్రామస్తులు లోక్‌సభ ఎన్నికలను బహిష్కరించారు. దీంతో ఓటర్లు లేక 179వ పోలింగ్‌ కేంద్రం వెలవెలబోతోంది. గ్రామంలో ఉన్న గుట్ట మైనింగ్‌ను రద్దు చేయాలంటూ ప్రజలు ఎన్నికలను బహిష్కరించారు. విషయం తెలుసుకున్న ఆర్డీవో మాధవి.. మైలారం గ్రామానికి చేరుకుని ఓటర్లతో చర్చిస్తున్నారు. అయితే మైనింగ్‌ ఎన్‌ఓసీని రద్దు చేసే వరకు ఎన్నికలలో పాల్గనమని గ్రామస్థుల స్పష్టం చేశారు.

➡️