విద్యుత్‌ సర్దుబాటు చార్జీలు రద్దు చేయాలి

  • సిపిఎం రాష్ట్ర మహాసభ డిమాండ్‌

ప్రజాశక్తి – కామ్రేడ్‌ సీతారాం ఏచూరి నగర్‌ (నెల్లూరు)
తక్షణమే విద్యుత్‌ అదనపు సర్దుబాటు ఛార్జీలు రద్దు చేయాలని సిపిఎం రాష్ట్ర మహాసభ డిమాండ్‌ చేసింది. స్మార్ట్‌ మీటర్లు బిగించడం ఆపాలని, అదానీ ఒప్పందాన్ని రద్దు చేయాలనే తీర్మానాన్ని ఎ.నాగరాజు (నంద్యాల) ప్రవేశపెట్టగా, వై.నేతాజీ (గుంటూరు) బలపరిచారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీకి భిన్నంగా ఏడు నెలల కాలంలోనే టిడిపి కూటమి ప్రభుత్వం రూ.15,485 కోట్ల సర్దుబాటు ఛార్జీల భారాన్ని మోపిందని మహాసభ విమర్శించింది. 30 నెలల నుండి వసూలు చేస్తున్న ట్రూఅప్‌ ఛార్జీలకు తోడు మరో మూడు రకాల సర్దుబాటు ఛార్జీలను ఈ సర్కార్‌ అదనంగా మోపిందని తెలిపింది. విద్యుత్‌ సుంకం పేరుతో వ్యాపార సంస్థలు, పరిశ్రమల నుండి యూనిట్‌కు ఆరు పైసల నుండి 100 పైసలకు పెంచడానికి చట్ట సవరణ చేసిందని విమర్శించింది. ‘కేంద్రంలోని బిజెపి, రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ప్రమాదకరమైన విద్యుత్‌ సంస్కరణలను దూకుడుగా అమలు చేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. గత వైసిపి ప్రభుత్వం కేంద్రం ఆదేశాలకు తలొగ్గి సెకి ద్వారా అదానీ సంస్థల నుండి కొనుగోలు చేయడానికి ఒప్పందం చేసుకుందని విమర్శించింది. రాష్ట్ర ప్రభుత్వ పెద్దలకు రూ.1,750 కోట్ల ముడుపులు ఇచ్చి అదానీ సంస్థ ఈ అక్రమ ఒప్పందాలను కుదుర్చుకున్నదనే ఆరోపణలపై అమెరికా కోర్టులో సాక్ష్యాధారాలతో విచారణ జరుగుతోందని తెలిపింది. తెలుగుదేశం, జనసేన, బిజెపి కూటమి ప్రభుత్వం ఈ ఒప్పందాన్ని రద్దు చేయకపోగా కుంటి సాకులతో కొనసాగించడం సిగ్గుచేటని పేర్కొంది.

‘కేంద్రంలోని బిజెపి ప్రభుత్వ ఆదేశాల మేరకు వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు బిగించడానికి గత వైసిపి ప్రభుత్వం పూనుకుంది. రైతులు పెద్దఎత్తున ప్రతిఘటించారు. మీటర్లు పెడితే పగలగొట్టాలని పిలుపునిచ్చిన కూటమి నేతలే మీటర్ల ఒప్పందాలను రద్దు చేయకుండా వేగంగా బిగిస్తున్నారు. ఈ స్మార్ట్‌ మీటర్లు పెట్టి క్రమంగా విద్యుత్‌ పంపిణీని ప్రైవేటీకరించడానికి ప్రభుత్వాలు కుట్ర పన్నాయి.” అని పేర్కొంది.
”గ్రీన్‌ ఎనర్జీ పేరుతో బడా సంస్థలకు భూములు కారుచౌకగా కట్టబెడుతున్నారు. రాయితీలు ప్రకటిస్తున్నారు. గిరిజన ప్రాంతాల్లో సైతం రాజ్యాంగ విరుద్దంగా చట్టాలను ఉల్లంఘించి పంప్డ్‌ హైడ్రో ప్రాజెక్టుల పేరిట అదానీ సంస్థలకు వేల ఎకరాల భూమిని కట్టబెడుతున్నారు.” అని విమర్శించింది.

➡️