విద్యుత్‌ రంగ సమస్యలు పరిష్కరించాలి

12న విశాఖలో సదస్సు
ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : ఎపిఇపిడిసిఎల్‌ పరిధిలో విద్యుత్‌ రంగ ఉద్యోగులు, కాంట్రాక్ట్‌ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ విశాఖ అల్లూరు విజ్ఞాన కేంద్రంలో 12న జరిగే సదస్సును విజయవంతం చేయాలని యునైటెడ్‌ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్‌ వర్కర్స్‌ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షులు జె రాజశేఖర్‌ కోరారు. విజయనగరంలోని విద్యుత్‌ భవనంతో పాటు పలు సబ్‌స్టేషన్లలో పర్మినెంట్‌, కాంట్రాక్ట్‌ కార్మికులు, షిఫ్ట్‌ ఆపరేటర్లు, కంప్యూటర్‌ ఆపరేటర్లు తదితర విభాగాలకు చెందిన కార్మికులతో కలిసి శుక్రవారం ఆయన సమస్యలపై చర్చించారు. ఈ సందర్భంగా రాజశేఖర్‌ మాట్లాడుతూ 2022 పిఆర్‌సి ఎరియర్స్‌ తక్షణమే ఇవ్వాలని, పెండింగ్‌లో ఉన్న పెయిడ్‌ హాలిడేస్‌ చెల్లించాలని, విడిఎలు అమలు చేయాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, పదేళ్ల ఇన్సెంటివ్‌ ఇవ్వాలని తదితర ప్రధాన డిమాండ్లు పరిష్కారం కోసం ఈ సదస్సు జరుగుతుందన్నారు. కేంద్ర రాష్ట్ర, ప్రభుత్వాలు విద్యుత్తు రంగాన్ని పూర్తిగా ప్రయివేటీకరిస్తున్న నేపథ్యంలో కాంట్రాక్ట్‌ కార్మికుల ఉద్యోగ భద్రత ప్రమాదంలో పడుతుందని, వారందరికీ రెగ్యులర్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. అనంతరం సదస్సు వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు జి అప్పలసూరి, జిల్లా కార్యదర్శి ఎ జగన్మోహన్‌రావు, విద్యుత్‌ కాంట్రాక్ట్‌ కార్మికులు పాల్గన్నారు.

➡️